ఎన్నికలకు ముందు ఉద్యోగాల నోటిఫికేషన్..ఎందుకో?

September 23, 2017


img

ఉద్యోగాల భర్తీ ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగుతుంటుంది. కనుక సింగరేణిలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ను కూడా ఆహ్వానించవలసిందే. అయితే అందుకు ప్రభుత్వం ఎంచుకొన్న సమయమే అభ్యంతరకరమని ప్రతిపక్షాలు వేలెత్తి చూపే అవకాశం ఉంది. అక్టోబర్ 5న సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే సింగరేణిలో ఆ వేడి రాజుకొంది. ప్రతిపక్షాలు..అవి బలపరుస్తున్న ఏఐటియుసి నేతలు తమ ఎన్నికల ప్రచారంలో ‘వారసత్వ ఉద్యోగాలపై తెరాస సర్కార్ తన హామీని నిలబెట్టుకోలేకపోయిందని’ విమర్శలు గుప్పిస్తున్నారు. వారి విమర్శలు సహేతుకమైనవే గనుక తెరాస నేతలు, వారు బలపరుస్తున్న తెలంగాణా బొగ్గు గని కార్మిక సంఘం నేతలు, ప్రతిపక్షాలకు సమాధానం చెప్పలేక తడబడుతున్నారు. అందుకే తెరాస ఎంపి కవిత రంగంలో దిగి వారసత్వ ఉద్యోగాలు తప్పకుండా సాధిస్తామని మళ్ళీ హామీ ఇస్తున్నారు. కానీ ఆమె మాటలను కూడా సింగరేణి కార్మికులు నమ్మడం లేదు. వారసత్వ ఉద్యోగాల హామీని అమలుచేయాలని తెరాస సర్కార్ కు నిజంగానే చిత్తశుద్ధి ఉండి ఉంటే, ఈ సమస్యపై ఇంతకాలం ఎవరూ ఎందుకు మాట్లాడటానికి ఇష్టపడలేదని ప్రశ్నిస్తున్నారు. 

కనుక ఆగ్రహంతో ఉన్న సింగరేణి కార్మికులను చల్లబరచాలంటే, అత్యవసరంగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడమే మార్గమని ప్రభుత్వం భావించి ఉంటే ఆశ్చర్యం కాదు. తద్వార వారసత్వ ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వం ఏమీ చేయకపోయినా, ఉద్యోగాల భర్తీకి ఎప్పుడూ వెనుకాడటం లేదని గట్టిగా చెప్పుకొని ప్రతిపక్షాలను..అవి బలపరుస్తున్న ఏఐటియుసి కార్మిక సంఘాన్ని నిలువరించి ఎన్నికలలో విజయం సాధించవచ్చునని తెరాస సర్కార్ భావిస్తుండవచ్చు. 

సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ చెప్పిన మాటలు వింటే ఈ వాదన నిజమేనని అర్ధం అవుతుంది. “తెలంగాణ బిడ్డలకు ఉద్యోగావకాశాలు కల్పించాలనే ఉద్దేశంతోనే సింగరేణిలో చిరకాలంగా పెండింగ్‌లో ఉన్న ఖాళీలను భర్తీచేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు గత రెండేండ్లుగా సింగరేణిలో ఉద్యోగాల నియామకాలు చేపడుతున్నాము,” అని చెప్పారు. 

నిరంతరంగా సాగుతుండవలసిన ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు కూడా ముఖ్యమంత్రి ఆదేశిస్తేనే జరుగుతోందని ఆయన చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. సింగరేణితో సహా వివిద ప్రభుత్వశాఖల ఖాళీలు ఏర్పడినప్పుడు, పనులు సజావుగా సాగిపోవడానికే భర్తీ చేయడం అనివార్యం. అది ఒక సహజ ప్రక్రియే తప్ప ఎవరినో ఉద్ధరించడానికి చేస్తున్నది కాదు. కానీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కూడా ఇదివరకు ఎన్నడూ ఎవరూ చేయని గొప్ప ఘనకార్యం అన్నట్లు చెప్పుకోవలసిన అవసరం లేదు. 

ప్రతిపక్షాలు కూడా ఉద్యోగాలు భర్తీ చేయాలనే డిమాండ్ చేస్తున్నాయి. కానీ వాటికోసం ఇస్తున్న ఈ నోటిఫికేషన్ ఎన్నికల ప్రకటన వెలువడక మునుపు లేదా ఎన్నికలు ముగిసిన తరువాత ఇస్తే ఎవరూ ప్రభుత్వాన్ని ఈవిధంగా వేలెత్తి చూపలేరు. మరో 10 రోజులలో ఎన్నికలు జరుగబోతుంటే ఉద్యోగాలా భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం కార్మికులను ప్రభావితం చేయడానికేనని ప్రతిపక్షాలు ఆరోపించకుండా ఉండవు. 

ఇక ఈ నోటిఫికేషన్ తో భర్తీ చేయబోయే ఉద్యోగాల జాబితా చూసినట్లయితే అన్నీ ట్రైనీ పోస్టులే కనిపిస్తాయి తప్ప ఒక్కటీ నేరుగా రిక్రూట్ చేసుకొనే ఉద్యోగాలు లేవు. అంటే ట్రైనీ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాల భర్తీ చేస్తున్నామని ప్రభుత్వం చెప్పుకొంటున్నట్లు అర్ధం అవుతోంది. ఏమైనప్పటికీ కార్మిక సంఘాల ఎన్నికలను కూడా తెరాస ఇంత ప్రతిష్టాత్మకంగా..సవాలుగా తీసుకోవలసిన అవసరం ఉందా? అనే ప్రశ్నకు తెరాసయే జవాబు చెప్పాల్సి ఉంటుంది.  


Related Post