భారత్ చివాట్లు దున్నపోతుపై కురిసిన వానేనా?

September 23, 2017


img

“ఇక ముసుగులో గుద్దులాటలు లేవు. పాకిస్తాన్ ఒక ఉగ్రవాదదేశమే. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించి వారిని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ కు అది సరైనపేరు కాదు. టెర్రరిస్తాన్ సరైన పేరని మేము భావిస్తున్నాము,” అని న్యూయార్క్ లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాలలో భారత్ కుండబ్రద్దలుకొట్టినట్లు విస్పష్టంగా చెప్పింది. 

ఈ సమావేశాలకు ముందు పాక్ ప్రధాని అబ్బాసి మీడియాతో మాట్లాడుతూ “ఒకవేళ భారత్ మాపై యుద్దానికి దిగితే దానిపై అణ్వాయుధాలు ప్రయోగించడానికి వెనుకాడబోము,” అని చెప్పడంపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తరువాత సమావేశంలో మాట్లాడుతూ, కాశ్మీర్ సమస్యను పరిష్కరించడానికి ఐక్యరాజ్యసమితి ఒక ప్రత్యేక బృందాన్ని పంపించాలని కోరారు. 

అందుకు బదులుగానే ఇంత నిష్కర్షగా పాకిస్తాన్ ఒక ఉగ్రవాదదేశమని చెప్పింది. అంతేకాదు ఉగ్రవాదాన్ని గ్లోబైలైజేషన్ చేయడానికి పాకిస్తాన్ దే ప్రధానపాత్ర అని తేల్చి చెప్పింది. 

ఐక్యరాజ్యసమితి లో భారత్ ప్రధానకార్యదర్శి ఈనాం గంభీర్ ఈ సమావేశాలలో పాల్గొన్న సభ్యదేశాలను ఉద్దేశ్యించి ప్రసంగిస్తూ, “ఉగ్రవాదాన్ని ప్రపంచమంతా వ్యాపింపజేయడంలో పాకిస్తాన్ దానికదే సాటి. అయితే విశేషమేమిటంటే, దాని దుష్టచేష్టలకు అది కూడా బారీగా మూల్యం చెల్లించక తప్పడం లేదు. ఐక్యరాజ్యసమితి చేత ఉగ్రవాద సంస్థగా ముద్రవేయబడిన లష్కర్-ఏ-తోయిబా సంస్థ అధినేత స్వయంగా ఒక రాజకీయ పార్టీ పెట్టి అధికారం దక్కించుకోవాలని చూస్తున్నాడు. ఇది పాకిస్తాన్ ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోంది. ఆ దేశంలో ఉగ్రవాదం ఏస్థాయిలో ఉందో తెలుసుకోవడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. వారికి తన మిలటరీ శిభిరాలలో శిక్షణ, రక్షణ కల్పించడమే కాకుండా ఇప్పుడు రాజకీయంగా వారికి రక్షణ కవచం కూడా ఏర్పాటు చేయబోతోంది. పాక్ ఉగ్రవాదాన్ని ఎవరూ సమర్ధించలేరు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పాక్ ఎంతగా అల్లర్లు సృష్టిస్తున్నప్పటికీ జమ్మూ కాశ్మీర్ ఎప్పటికీ భారత్ లో అంతర్భాగంగానే ఉంటుంది తప్ప దాని ప్రయత్నాలు ఫలించవని గుర్తుంచుకోవాలి,” అని తీవ్రంగా హెచ్చరించారు. 

ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్ ఎన్నడూ పాక్ ను ఉద్దేశ్యించి ఇంత కటువుగా మాట్లాడలేదు. కానీ ఈసారి నేరుగా పాకిస్తాన్ పేరు చెప్పి మరీ తీవ్ర విమర్శలు చేసింది. అయితే ఉగ్రవాదుల పట్ల సానుకూలంగా వ్యవహరిస్తున్న పాక్ మిలటరీ కనుసన్నలలో పాక్ ప్రభుత్వం నడుస్తున్నంత కాలం ఆ దేశానికి ఎవరు ప్రధానమంత్రి అయినా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా తప్పనిసరిగా ఇలాగే వ్యవహరిస్తుంది...ఇలాగే మాట్లాడుతుంటుంది. కనుక భారత్ చివాట్లు..దాని ఆగ్రహం దున్నపోతు మీద కురిసిన వానతో సమానమని చెప్పవచ్చు. 


Related Post