తెరాస గెలుపుకు ఉప ఎన్నికలతో శ్రీకారం?

September 22, 2017


img

నల్లగొండ లోక్ సభ సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయడంతో ఆ స్థానం భర్తీ చేయడానికి ఉపఎన్నికలు జరిగే అవకాశం ఉంది కనుక వాటి గురించి ప్రతిపక్షాల హడావుడి మొదలైపోయింది. కాంగ్రెస్ తరపున కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తెదేపా తరపున రేవంత్ రెడ్డి పోటీకి సిద్దమని ఇప్పటికే ప్రకటించారు. రాష్ట్ర భాజపా అధ్యక్షుడు కె.లక్ష్మణ్ కూడా ఈ ఉప ఎన్నికలలో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ప్రకటించేరు. కనుక ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్ధిగా రేవంత్ రెడ్డి లేదా మరొకరినీ నిలబెట్టే ప్రయత్నాలు ఫలించ లేదని, ఇప్పుడు ఆ అవకాశం లేదని స్పష్టమయింది. 

తెరాస కూడా సరిగ్గా ఇదే కోరుకొంటోందని చెప్పవచ్చు. ఇంతవరకు వివిధ ప్రజా సమస్యలపై పరస్పరం సహకరించుకొంటున్న ప్రతిపక్షాలు వచ్చే సార్వత్రిక ఎన్నికలలో తెరాసను డ్డీ కొని ఓడించేందుకు పరస్పరం సహకరించుకోవాలని ఆలోచనలు చేస్తున్నాయి. కానీ నల్లగొండ ఉప ఎన్నికలలో అవి పోటీపడటం ఖాయం అని తేలిపోయింది కనుక అవి తప్పనిసరిగా ఒకదానినొకటి ఘాటుగా విమర్శించుకోక తప్పదు. దానితో ప్రతిపక్షాల ఐక్యత ఏపాటిదో ప్రజలకు కూడా అర్ధం అవుతుంది. 

ఒకవేళ అవి నిజంగా సహకరించుకొని ఉమ్మడి అభ్యర్ధిని నిలబెట్టి ఉండి ఉంటే అతను లేదా ఆమెను ఓడించడానికి తెరాస చాలా చెమటోడ్చవలసి వచ్చేది. గెలిస్తే సంతోషమే కానీ ఓడిపోతే తలదించుకోవలసి వస్తుంది. కానీ తెరాసకు ఆ ఇబ్బంది కలుగకుండా ప్రతిపక్ష పార్టీలన్నీ ఉప ఎన్నికలలో దేనికవి బరిలో దిగడానికి సిద్దం అవుతున్నాయి కనుక తెరాస అప్పుడే సగం విజయం సాధించేసినట్లే చెప్పవచ్చు. ప్రతిపక్షాల ఈ అనైక్యత కారణంగా ఓట్లు చీలిపోతాయి కనుక తెరాస గెలుపు ఇంకా సులువు అవుతుంది. 

నల్లగొండలో తాను ఉండగా తెరాస ఎన్నటికీ గెలవలేదని, ఓడిస్తే రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని సవాలు విసురుతున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఓడించగలిగితే అయన వేలితో ఆయన కంటినే పొడుచుకొనేలా చెసినట్లవుతుంది. కనుక ప్రతిపక్షాలు అనైక్యతే తెరాసకు శ్రీరామరక్షగా నిలువబోతోంది. కనుక 2019 ఎన్నికలకు నల్లగొండ ఉప ఎన్నికలే శ్రీకారమని ప్రతిపక్షాలు పగటికలలు కంటుంటే, అవే తెరాస విజయానికి శ్రీకారంగా మారవచ్చు. 


Related Post