కమల్ ఎర్రచొక్క..రజనీ కాషాయం చొక్కా?

September 22, 2017


img

కొత్త పార్టీతో ప్రత్యక్ష రాజకీయాలలోకి రావడానికి సిద్దపడుతున్న కమల్ హాసన్ కొన్ని రోజుల క్రితం మీడియాతో మాట్లాడుతూ, “ కాషాయం నాకు అసలు పడదు...ఎర్ర చొక్కాలే నాకు బాగా సూట్ అవుతాయి”’ అని అన్నారు. అంటే భాజపాతో అడ్జస్ట్ అవలేనని, అవసరమైతే వామపక్షాల మద్దతు తీసుకొంటానని చెప్పకనే చెప్పారు. 

కమల్ హాసన్ తన మనసులో ఈ మాటను బయటపెట్టేసి, రాజకీయపార్టీ పెట్టడం ఖాయం అని ప్రకటించిన తరువాత, ఇంతవరకు రాజకీయాలలోకి రావాలా వద్దా అనుకొంటూ ఆకాశం వైపు చూస్తూ ఊగిసలాటలోనే రోజులు దొర్లించేస్తున్న రజనీకాంత్ ఈరోజు హటాత్తుగా “ప్రధాని మోడీ ప్రారంభించిన స్వచ్చాతాహి సేవా’ కార్యక్రమానికి నేను సంపూర్ణ మద్దతు ఇస్తున్నానని” ట్వీట్ చేయడం గమనార్హం. 

తమిళనాడు శాసనసభ ఎన్నికలప్పుడు సాక్షాత్ ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ఆయన ఇంటికి వెళ్ళి తమ పార్టీలో చేరమని అభ్యర్ధించారు. లేకుంటే కనీసం భాజపాకు మద్దతు ఇమ్మని కోరారు. కానీ అప్పుడు రజనీకాంత్ స్పందించలేదు. ఆ కారణంగా రాష్ట్రంలో భాజపా పోటీ చేసినప్పటికీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. 

అదే రజనీకాంత్ ఇప్పుడు మోడీ సర్కార్ చేపట్టిన ఈ కార్యక్రమానికి మద్దతు ప్రకటించడం చూస్తే భాజపాకు లేదా పళని-పన్నీర్ సర్కారుకు మద్దతు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారనుకోవాలా? అదే జరిగితే కమల్ ఎర్రచొక్క..రజనీ కాషాయం చొక్కా తొడుక్కొంటారేమో? ఏమో?


Related Post