ముఖ్యమంత్రి పదవికి నేను రెడీ: కమల్ హాసన్

September 22, 2017


img

ఇంతవరకు సినీరంగంలో తన ప్రతిభను నిరూపించుకొన్న కమల్ హాసన్ త్వరలో రాజకీయాలలో కూడా ఎంట్రీ ఇచ్చి తన సత్తా చాటుకోవాలనుకొంటున్నారు. రజనీకాంత్ ఒక మాట చెప్పడానికి వందసార్లు ఆలోచిస్తే, కమల్ మాత్రం మనసులో ఆలోచన వచ్చిందే తడువు వెంటనే దానిని బయటపెట్టేస్తుంటారు. 

ఆయన రాజకీయ ప్రవేశం చేయడం దాదాపు ఖరారు అయిపోయింది కనుక ఇప్పుడు అందరి దృష్టి అయనపైనే ఉంది. ఆయన ఇండియా టుడేకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ఎవరూ ఊహించలేని మాట ఒకటి చెప్పారు. “యస్! నేను తమిళనాడు ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి సిద్దంగా ఉన్నాను. మీరు (జనాలు) కూడా  సిద్దంగా(నాకు మద్దతు ఇచ్చేందుకు) ఉన్నారా? అని ప్రశ్నించారు. 

“నేను ఒక్కడినే మారితే సరిపోదు. ప్రజలు, వారి ఆలోచనా తీరు కూడా మారినప్పుడే ఏ మార్పయినా సాధ్యం అవుతుంది. ఒక సమర్ధుడు, నిజాయితీపరుడైన వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో ఉండాలని ప్రజలు కోరుకొంటున్నట్లయితే వారు నిజాయితీగా అటువంటి వ్యక్తినే ఎన్నుకోవలసి ఉంటుంది. నాకు సంపూర్ణ మద్దతు ఇచ్చేందుకు ప్రజలు సిద్దపడితే ప్రత్యక్ష రాజకీయాలలో దిగి ఈ వ్యవస్థను శుభ్రపరచడానికి నేను కూడా సిద్దమే,” అని అన్నారు. 

కమల్ హాసన్ రాజకీయాలలోకి రావాలనుకోవడం మంచి పరిణామమే కావచ్చు కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్న పళని, పన్నీరు వర్గాలు, వారికి అండగా నిలబడుతున్న కేంద్రప్రభుత్వం, ప్రతిపక్షంలో ఉన్న డిఎంకె నేత స్టాలిన్, ఆయన వెనుకున్న కాంగ్రెస్ పార్టీ కమల్ హాసన్ ను అడ్డుకోకుండా ఉంటారా? అడ్డుకొన్నా ఆయన ధైర్యంగా రాజకీయాలలోకి రాగలరా?వచ్చినా ప్రజలు ఆయనతో మరొక రాజకీయ ప్రయోగం చేయడానికి ఇష్టపడతారా లేదా? అనేది మున్ముందు తెలుస్తుంది. 


Related Post