తెరాస నేత ఆయుబ్ ఖాన్ మృతి

September 22, 2017


img



తెరాస నేత, వికారాబాద్ లో తాండూర్ పట్టణ మాజీ అధ్యక్షుడు ఆయుబ్ ఖాన్ ఈరోజు ఉదయం అపోలో ఆసుపత్రిలో మరణించారు. కొన్ని రోజుల క్రితం తాండూర్ లో మంత్రి మహేందర్ రెడ్డి పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తున్నప్పుడు, ఆ సమావేశంలో మొదట మాట్లాడిన ఆయుబ్ ఖాన్ ‘తెరాసలో తనవంటి ఉద్యమకారులకు, పార్టీకోసం కష్టపడి పనిచేస్తున్నవారికి సముచిత స్థానం, గౌరవం లభించడం లేదని’ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మంత్రిగారు ప్రసంగిస్తున్న సమయంలో ఆయూబ్ ఖాన్ తన వెంట తెచ్చుకొన్న పెట్రోల్ ఒంటిపై పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య ప్రయత్నం చేశారు. ఆ ఘటనలో ఆయూబ్ ఖాన్ తల, ఛాతి, చేతులు బాగా కాలిపోయాయి. 

అక్కడున్న తెరాస కార్యకర్తలు మంటలు ఆర్పి రక్షించే ప్రయత్నం చేశారు. మంత్రి మహేందర్ రెడ్డి వెంటనే ఆయనను హైదరాబాద్ లో అపోలో ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించినప్పటికీ గాయాల తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నందున ఆయుబ్ ఖాన్ ఈరోజు ఉదయం మృతి చెందారు. 

ఈ సంగతి తెలుసుకొన్న మంత్రి మహేందర్ రెడ్డి, తెరాస నేతలు అపోలో ఆసుపత్రికి వెళ్ళి ఆయూబ్ ఖాన్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారిని తెరాస అన్ని విధాలుగా ఆదుకొంటుందని హామీ ఇచ్చారు. 

తెలంగాణా రాష్ట్ర సాధన కోసం, ఆ తరువాత తెరాస కోసం కష్టపడిన వారికి పార్టీలో, ప్రభుత్వంలో తగిన గుర్తింపు లభించడం లేదని చెప్పడానికి, ఆ కారణంగా వారు ఎంత మనోవేధన అనుభవిస్తున్నారో తెలుసుకోవడానికి ఇది ఒక ప్రత్యక్ష నిదర్శనం. 

తెలంగాణా ఉద్యమాలు చేస్తున్నప్పుడు ఎవరూ పదవులు, అధికారం ఆశించి చేయలేదు. తెలంగాణా వస్తే చాలనే కోరికతోనే చేశారు. కానీ ఇప్పుడు తమ పార్టీయే అధికారంలో ఉంది కనుక తమకు పార్టీలో, ప్రభుత్వంలో సముచిత స్థానం, గౌరవం లభించాలని వారు కోరుకోవడం సహజమే. కానీ తెరాస అధికారంలోకి వచ్చిన తరువాత తన ఉద్యమస్ఫూర్తిని, ఆలోచనలను పక్కనపెట్టి ఫక్తూ రాజకీయ పార్టీగా మారిపోయింది. రాష్ట్రంలో తనకు ఎదురులేకుండా ఉండేందుకు ఇతర పార్టీల నేతలను, ఎమ్మెల్యేలను తెరాసలోకి ఫిరాయింపజేసి, ఉద్యమకారులను పక్కనబెట్టి వారికే పెద్దపీట వేసింది. అది సహజంగానే పార్టీలో మొదటి నుంచి ఉండి పార్టీ కోసం కష్టపడుతున్న ఆయూబ్ ఖాన్ వంటివారికి ఆవేదన కలిగిస్తుంది. ఆ బాధను భరించగలిగినవారు భరిస్తున్నారు...తట్టుకోలేనివారు ఏదో ఒకరోజు తప్పకుండా పార్టీని వీడే అవకాశం ఉంటుంది. 

ఆయూబ్ ఖాన్ వంటి నిఖార్సయిన తెరాస కార్యకర్తను పోగొట్టుకొన్నందున ఇకనైనా ముఖ్యమంత్రి కేసీఆర్ వారి ఆవేదనను గుర్తిస్తారా లేక యధాప్రకారం ఫక్తూ రాజకీయపార్టీ పంధాలోనే ముందుకు సాగుతారా? చూడాలి. 


Related Post