మరి పదేళ్ళు ఏమి పీకారో?

September 21, 2017


img

అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేకపోయినా, ప్రతిపక్షంలోకి మారినప్పుడు అధికారపార్టీలను..అవి నడిపే ప్రభుత్వాలను విమర్శించడం చాలా సులువని రాహుల్ గాంధీ నిరూపించారు. ఆయన ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నారు. 

ఆ పర్యటనలో భాగంగా ప్రిన్స్ టన్ యూనివర్సిటీ విద్యార్ధులను ఉద్దేశ్యించి ఆయన మాట్లాడుతూ, “భారత్, అమెరికా దేశాలలో నిరుద్యోగ సమస్య ఉందని ట్రంప్, మోడీ వంటి నేతలు గుర్తించి, ఆ సమస్య గురించి మాట్లాడి, ఉద్యోగాలు కల్పిస్తామని హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చారని నేను భావిస్తున్నాను. నాకు ట్రంప్ ఎవరో తెలియదు...కానీ మోడీ మాత్రం తన హామీని నిలబెట్టుకోలేకపోయారనే నేను భావిస్తున్నాను. దేశంలో రోజుకు సుమారు 30, 000 మంది నిరుద్యోగులు తయారవుతుంటే ప్రభుత్వం మాత్రం రోజుకు 500 ఉద్యోగాలు మాత్రమే కల్పిస్తోంది. ఆ కారణంగా నానాటికీ నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతోంది. ఉద్యోగాలు దొరకక వారిలో ఆందోళన పెరిగిపోతోంది. మోడీ, ట్రంప్ వంటి నేతలు దానిని సొమ్ము చేసుకొన్నారని నేను భావిస్తున్నాను. ఉద్యోగం, ఉపాధి కల్పన అంటే యువతకు సాధికారికత, స్వేచ్చ కల్పించి వారు కూడా దేశ నిర్మాణంలో భాగస్వాములు అయ్యేందుకు అవకాశం కల్పిస్తుంది,”  అని అన్నారు. 

నిరుద్యోగ సమస్య గురించి రాహుల్ గాంధీకి ఇంత గొప్ప అవగాహన ఉన్నప్పుడు యూపియే ప్రభుత్వం పదేళ్ళపాటు దేశాన్ని పాలించినప్పుడు ఈ సమస్యను ఎందుకు పరిష్కరించలేదో ఆయన వివరించి ఉండి ఉంటే బాగుండేది. పదేళ్ళ యూపియే హయంలో అందరి కళ్ళకు స్పష్టంగా ఏమి కనబడ్డాయంటే ఎక్కడ చూసినా అవినీతి, అలసత్వం, అసమర్ధత, కుంభకోణాలు మాత్రమే. వాటితో విసుగెత్తిపోయిన ప్రజలు కాంగ్రెస్ పార్టీని దింపి భాజపాకు పట్టం కట్టారు. 

భాజపా అధికారంలోకి రావడానికి మోడీ మాటల మాయాజాలం కూడా కొంత తోడ్పడి ఉండవచ్చు కానీ అదే ప్రధాన కారణమని రాహుల్ గాంధీ భావించడం అవివేకమే. ఒకవేళ దేశ ప్రజలను మాయమాటలతో మభ్యపెట్టి అధికారంలోకి రావడం అంత సులువయితే, 2014 నుంచి ఇంతవరకు జరిగిన దాదాపు అన్ని ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓడిపోతోంది? నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడి హామీలు గుప్పిస్తే ప్రజలు గుడ్డిగా ఓట్లు వేసేస్తారనుకొంటే రాహుల్ గాంధీ కూడా 2019 ఎన్నికలలో ఆ ప్రయత్నం చేసుకోవచ్చు. 


Related Post