అమ్మకు వందనం...అందరికీ ఆనందం

September 20, 2017


img

ఈ ప్రపంచంలో ఎవరికైనా మొట్టమొదటి గురువు తల్లే. ఆ తరువాతే మిగిలిన వారందరూ. అయితే ఇప్పుడు కాలం మారింది..దానితో బాటే మనుషులు వారి ఆలోచనలు అన్నీ మారాయి. చిన్నప్పుడు తమను గుండెల మీద పెట్టుకొని పెంచిన తల్లితండ్రులే ఇప్పుడు గుదిబండల్లా కనిపిస్తున్నారు. వారికి శరీరంలో శక్తి, ఓపిక ఉన్నంత కాలం సేవలు చేయాలి. అప్పుడే వారికి వారి కొడుకులు, కోడళ్ళు రెండు ముద్దలు పడేస్తారు. లేకుంటే ఏ వృద్దాశ్రమంలోనో అనాధాశ్రమంలోనో పడేస్తారు. 

దీనికంతటికీ ప్రధానకారణం జనరేషన్ గ్యాప్ అనుకోవచ్చు కానీ పిల్లలకు తల్లి తండ్రులతో బాల్యం నుంచే బలమైన అనుబందం ఏర్పరచుకొని దానిని వారు పెద్దయ్యేవరకు కొనసాగించగలిగితే వృద్దాప్యంలో ఇటువంటి బాధాకరమైన పరిస్థితులు తప్పకుండా తగ్గించవచ్చు. 

ఒక పిల్లాడు బాధ్యత గల మంచి పౌరుడుగా ఎదగాలంటే పాఠశాలలోనే తీర్చిదిద్దబడాలి. దేశంలో నేడు కనబడుతున్న అనేక ఘోరాలు, నేరాలకు మూలకారణం వారిలోని నేరప్రవృతి మాత్రమే కారణం కాదు. బాల్యంలో వారికి సరైన శిక్షణ లేకపోవడమే. అందుకే మొక్కై వంగనిది మానై వంగునా? అన్నారు పెద్దలు. 

విత్తును బట్టే మొక్క అంటారు పెద్దలు. బాల్యంలో వారి మనసులలో ఎటువంటి భావాలను ఫీడ్ చేస్తామో వాటి ఆధారంగానే వారి జీవితాలు సాగుతుంటాయి. కనుక పిల్లలకు చిన్నప్పటి నుంచే తల్లితండ్రులతో, గురువులతో, సహవిద్యార్దులతో, ముఖ్యంగా బాలికలతో ఒక బలమైన అనుబంధం, ప్రేమ, గౌరవం, నమ్మకం వంటి భావాలు  కలిగించగలిగితే నేడు మనం చూస్తున్న అనేక సామాజిక సమస్యలు కనబడకుండా మాయం అయిపోతాయి.

తెలంగాణాలో కొన్ని ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఇటువంటి ఒక కార్యక్రమం స్పూర్తితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ‘అమ్మకు వందనం’ అనే ఒక కార్యక్రమాన్ని అమలుచేస్తోంది. రాష్ట్రంలో అన్ని పాఠశాలలో ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

ఆ ఆలోచనలను అక్షరాల అమలుచేసి చూపించారు విజయనగరం జిల్లాలోని భోగాపురం మండలంలో గల పోలిపిల్లి జిల్లా పరిషత్ పాఠశాల ఉపాద్యాయులు. ఆ పాఠశాల హెడ్ మాస్టర్ బంగారు రాజుగారు అధ్వర్యంలో ఉపాద్యాయులు గీతాంజలి, ఝాన్సి, భవాని, సరిత, జయలక్ష్మి, వెంకటేశ్వర రావు, ఆచారి, సునీల్ తదితరులు పూనుకొని ‘అమ్మకు వందనం’ అనే ఈ కార్యక్రమాన్ని నేడు నిర్వహించారు. 

వారు ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్ధుల తల్లులను పాఠశాలకు రప్పించి, వారి పిల్లల చేత వారి పాదాలు కడిగించి అమ్మలను గౌరవించాలనే విషయం పిల్లలకు నేర్పించారు. ఇటువంటి గొప్ప అనుభవం ఎన్నడూ చూడని ఆ తల్లులు ఆనందంతో ఉబబితబ్బిబవుతూ తమ పిల్లలను, ఇటువంటి మంచి కార్యక్రమం చేపట్టిన ఉపాద్యాయులను, హెడ్ మాష్టర్ ను అభినందనలతో ముంచెత్తారు. దీని వలన తమ పిల్లలకు తమపట్ల గౌరవం ఏర్పడటమే కాకుండా తమ మద్య అనుబంధం ఇంకా బలపడుతుందని ఆ తల్లులు అన్నారు. 

ఎక్కడో ఇండోనేషియాలో మొదలైన ఈ మంచి కార్యక్రమం దేశంలో మొట్టమొదటగా తెలంగాణా రాష్ట్రంలో అక్కడి నుంచి ఆంధ్రాకు ఈవిధంగా విస్తరించడం గొప్ప విషయమే కదా..మనకీ గర్వకారణమే కదా!


Related Post