నో డౌట్ వచ్చేస్తున్నా...

September 15, 2017


img

ప్రముఖ తమిళ నటుడు కమల్ హాసన్ తాను త్వరలోనే స్వంత రాజకీయపార్టీతో ప్రత్యక్ష రాజకీయాలలో ప్రవేశించబోతున్నట్లు ఈరోజు చాలా విస్పష్టంగా ప్రకటించారు. ఆయన చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ, “నిజానికి నాకు రాజకీయాలలోకి రావాలనే కోరిక లేదు. రాష్ట్ర రాజకీయాలలో నెలకొన్న పరిస్థితుల కారణంగానే నేను ప్రవేశించవలసి వస్తోంది. రాష్ట్ర రాజకీయాలు పూర్తిగా భ్రష్టు పట్టిపోయాయి. వాటిని చూసి ప్రజలు కూడా అసహ్యించుకొంటున్నారు. వాటిని సమూలంగా ప్రక్షాళన చేయవలసిన సమయం ఇదేనని నేను భావిస్తున్నాను. అందుకే నేను రాజకీయాలలోకి ప్రవేశించవలసి వస్తోంది. రాష్ట్రంలో గల ఏ పార్టీలు నా ఆశయాలకు దరిదాప్పులో లేకపోవడం వలన నేను దేనిలో చేరకుండా స్వంత పార్టీ స్థాపించవలసివస్తోంది.

నేను భాజపా తరపునే కొత్త పార్టీని స్థాపిస్తున్నానే ఊహాగానాలలో అర్ధంపర్ధం లేదు. ఎందుకంటే నాకు భాజపా సిద్దాంతాలు అసలు మింగుడుపడవు. నా ఆలోచనలు, ఆశయాలు అన్నీ వామపక్షాల సిద్దాంతాలకు, వాటి భావజాలానికి కాస్త దగ్గరగా ఉంటాయి. కనుక ఎప్పుడైనా అవసరమైతే వాటితోనే చేతులు కలుపుతాను తప్ప ఎన్నడూ భాజపాతో కలుపను. 

అన్నాడిఎంకె పార్టీ నుంచి శశికళను తొలగించడం మంచి నిర్ణయమే. నిజానికి ఆమెను తొలగించాలని నేనూ కోరాను. అయితే ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప్రజలకు సేవ చేయకుండా రిసార్ట్స్ కూర్చొని జల్సాగా కాలక్షేపం చేస్తూ ప్రజలను మోసగిస్తున్నారు. పైగా తమను తాము పందుల్లా అమ్ముకొంటున్నారు. ఒక ప్రభుత్వోద్యోగి చిన్న తప్పు చేస్తే ప్రభుత్వమూ, కోర్టులు కటినంగా వ్యవహరిస్తాయి. కానీ ప్రజలకు సేవ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ఎమ్మెల్యేలు పనిచేయకుండా రిసార్ట్ రాజకీయాలు చేస్తుంటే, కోర్టులు పట్టించుకోకపోవడం చాలా బాధాకరం. 

ఇటువంటి అవకరాలను అన్నిటినీ తొలగించి వ్యవస్థను శుభ్రం చేయడానికే నేను రాజకీయాలలోకి ప్రవేశిస్తున్నాను. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేస్తాను. కనుక నా రాజకీయ ప్రవేశం గురించి ఇక ఎవరూ ఊహాగానాలు చేయనవసరం లేదు,” అని చెప్పారు.     

ఇంతకాలం రజనీకాంత్ రాజకీయాలలోకి రాబోతున్నారని ఉదృతంగా ప్రచారం జరిగింది కానీ ఇంతవరకు ఒక్కసారి కూడా రజనీకాంత్ ఈవిధంగా నిర్దిష్టంగా ప్రకటన చేసే సాహసం చేయలేకపోయారు. కనీసం వాటిని ఖండించలేకపోయారు. కానీ కమల్ హాసన్ ఉరుములు లేని పిడుగులాగ రాజకీయాలపై పడుతున్నారు. కనుక ఇక రజనీకాంత్ తన రాజకీయ ఆలోచనలను విరమించుకొంటారేమో? 

పళని, పన్నీరులను మంచి చేసుకొని తమిళనాడులో కూడా మెల్లగా పాగా వేయలని ప్రయత్నిస్తున్న భాజపాకు కూడ కమల్ సడన్ ఎంట్రీ పిడుగు పడినట్లే అవుతుంది. ఎందుకంటే తమిళనాడులో కమల్ హాసన్ కు కూడా విపరీతమైన జనాధారణ ఉంది. పైగా సాధారణ రాజకీయ నాయకుడిలా చవుకబారుగా మాట్లాడకుండా హుందాగా వ్యవహరిస్తుంటారు కనుక మద్యతరగతి, ఉన్నత వర్గాలలో కూడా ఆయనకు మంచి పేరు ఆధారణే ఉంది. కనుక కమల్ సదన్ ఎంట్రీతో తమిళనాడు రాజకీయాలు మళ్ళీ కొత్త మలుపు తిరుగబోతున్నట్లే చెప్పవచ్చు.    


Related Post