తెలంగాణాలో మరో రాజకీయ పునరేకీకరణ?

September 15, 2017


img

తెరాస సర్కార్ అధికారంలోకి వచ్చిన కొత్తలో బంగారి తెలంగాణా సాధన కోసం రాజకీయ పునరేకీకరణ పేరిట ప్రతిపక్ష పార్టీల నేతలను, ఎమ్మెల్యేలను ఫిరాయింపజేసిన సంగతి అందరికీ తెలుసు. ఆ కారణంగా రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలన్నీ చాలా బలహీనపడ్డాయి. అప్పటి నుంచి అవసరం పడినప్పుడు పార్టీలకు అతీతంగా అవి పరస్పరం సహకరించుకొంటూ తెరాస సర్కార్ ను ముప్పతిప్పలు పెడుతున్నాయి. త్వరలో జరుగబోయే సింగరేణి ఎన్నికలలో అన్ని పార్టీలు చేతులు కలపడం అందుకు తాజా ఉదాహరణగా కనిపిస్తోంది. 

అయితే నేటికీ రాష్ట్రంలో ప్రతిపక్షాలు పూర్తిగా ఏకత్రాటిపైకి రాలేదనే చెప్పాలి. కాంగ్రెస్, భాజపాలు రెండూ జాతీయస్థాయిలో బద్ధశత్రువులు కనుక రాష్ట్రంలో అవి చేతులు కలిపిపని చేయలేకపోతున్నాయి. ఆ కారణంగా ఆ రెండు పార్టీలు వచ్చే ఎన్నికలలో వేర్వేరుగానే పోటీ చేసి తెరాసను డ్డీ కొనడానికి సిద్దపడవలసి వస్తోంది. ఇది తెరాసకు బాగా కలిసివచ్చే అంశమే. 

వచ్చే ఎన్నికలు రాష్ట్రంలో అన్ని పార్టీలకు జీవన్మరణ సమస్యవంటివే. తెరాస తన అధికారం నిలబెట్టుకోలేకపోతే, అది చెప్పుకొంటున్నట్లు దానికి ప్రజాదరణ లేదని రుజువవుతుంది. పైగా ఇంతకాలం పడిన శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. కనుక తప్పనిసరిగా అధికారం నిలబెట్టుకోవలసి ఉంటుంది. నిలబెట్టుకొంటామనే నమ్మకం కూడా దానికి ఉంది.

ఇక పార్టీ ఫిరాయింపుల కారణంగా చాలా బలహీనపడిన ప్రతిపక్షాలు కనీసం వచ్చే ఎన్నికలలోనైనా గెలిచి అధికారం దక్కించుకోకపోతే తెరాస ఇంకా బలపడుతుంది. అప్పుడు ఇక రాష్ట్రంలో ప్రతిపక్షాలు పూర్తిగా అదృశ్యమయ్యే ప్రమాదం ఉంటుంది. పైగా ‘ప్రతిపక్షాలు రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడుతున్నాయనే తెరాస వాదనలతో ప్రజలు ఏకీభవించినట్లుగా  అవుతుంది. కనుక అవి కూడా గెలవక తప్పని పరిస్థితి. 

ఈ విషయం ప్రతిపక్షాలు గ్రహించే ఉంటాయి. కనుకనే చేతులు కలిపి పనిచేస్తున్నాయి. కానీ వచ్చే ఎన్నికలలో తెరాసను ఎదుర్కోవడానికి ఈ తాత్కాలిక సహకారాలు సరిపోవు కనుక అన్ని పార్టీలు ఒక నిర్దిష్టమైన కార్యాచరణ  రూపొందించుకోకతప్పదనే తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చెపుతున్నారు. ముఖ్యంగా తెరాస, తెలంగాణా  విషయంలో భాజపా తన వైఖరిని తెలియజేయాలని కోరారు. 

భూపాలపల్లిలో మీడియాతో మాట్లాడుతూ, “కేసీఆర్ నియంతృత్వ పాలన అంతమొందించడానికి రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణకు తెదేపా చొరవ తీసుకొంటుంది. తెరాసలో నిరాదరణకు గురవుతున్నవారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వారు కూడా మాతో చేతులు కలపడానికి సిద్దంగా ఉన్నారు. కనుక ఈవిషయంలో భాజపా తన వైఖరిని తెలియజేయాలి,” అని కోరారు. 

అయితే భిన్నదృవాల వంటి రాజకీయ పార్టీలు ఒకే వేదికపైకి వచ్చినా అవి ఎంతో కాలం కలిసి పనిచేయలేవని గతంలో అనేకసార్లు రుజువయింది. కనుక తెలంగాణాలో ప్రతిపక్షాల ఐఖ్యతా ప్రయత్నాలు ఎంతవరకు ముందుకు సాగుతాయో అవి ఏమేరకు ఫలిస్తాయో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే. 


Related Post