3019కైనా కాంగ్రెస్‌ అధికారంలోకి రాలేదు

September 13, 2017


img

తెరాస సర్కార్ ఏర్పాటు చేస్తున్న రైతు సమన్వయ సమితులకు పోటీగా కాంగ్రెస్ నేతలు గ్రామాలలో రైతు రక్షణ కమిటీల ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలుపెట్టడంతో కాంగ్రెస్-తెరాస నేతల మద్య మాటల యుద్ధాలు ప్రారంభం అయ్యాయి. 

తెరాస ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ, “కాంగ్రెస్ పదేళ్ళు అధికారంలో ఉండగా ఏనాడూ రైతుల కోసం ఏమీ చేయలేదు. ఆ కారణంగా దేశవ్యాప్తంగా కొన్ని వేలమంది రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారు. వారి ఉసురు తగిలినందునే కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది. అయినా కాంగ్రెస్ నేతలకు బుద్ధి రాలేదు. వారు చేయలేని పనులను మేము చేస్తుంటే వాటికీ అడ్డుపడుతున్నారు. తద్వారా వారు రైతుల కంచంలో మట్టి కొడుతున్నారు. కాంగ్రెస్ నేతలకు నిజంగానే రైతులపై అంత ప్రేమ ఉన్నట్లయితే వారి పార్టీ అధికారంలో ఉన్న కర్నాటక నుంచి రాష్ట్రానికి నీళ్ళు విడుదల చేయించాలి. ఒక పక్క రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడుతూనే మళ్ళీ 2019 ఎన్నికలలో విజయం సాధించి రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని ఉత్తం కుమార్ రెడ్డి ప్రగల్భాలు పలుకుతున్నారు. కానీ వారు ఇదేవిధంగా ప్రవర్తిస్తే 3019 నాటికి కూడా మళ్ళీ అధికారంలోకి రాలేరని ఖచ్చితంగా చెప్పగలను,” అని అన్నారు. 

కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క మాట్లాడుతూ, “కొందరు తెరాస నేతలు, కార్యకర్తలు మధిర నియోజక వర్గంలో ప్రజాసమస్యలను తమ ఇన్-ఛార్జ్ మంత్రి దృష్టికి తీసుకువెళితే “పార్టీలో ఉంటే ఉండండి లేకపోతే పొండి” అని అవమానించారు. ఆత్మగౌరవం చంపుకొని తెరాసలో ఉండవలసిన అవసరం ఏమిటి? ప్రజల కోసం పనిచేస్తున్న అటువంటి నేతలందరికీ కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తాము. ఒక్క మధిరలోనే కాదు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలలో ద్వితీయ శ్రేణి తెరాస నేతలకు, కార్యకర్తలకు ఇటువంటి చేదు అనుభవాలే ఎదురవుతున్నాయని మాకు తెలుసు. వాటిని దిగమింగుకొని పార్టీలో కొనసాగుతున్నారని కూడా మాకు తెలుసు. తెరాసలో నిరాదరణకు గురవుతున్న వారందరూ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినట్లయితే గర్వంగా తలెత్తుకొని ఆత్మగౌరవంతో జీవించవచ్చు. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీయే తప్పకుండా విజయం సాధించి అధికారంలోకి రావడం ఖాయం,” అని అన్నారు. 

తమ అనైక్యతే 2014 ఎన్నికలలో తమ విజయావకాశాలను దెబ్బ తీసిందని రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు బాగా తెలుసు. కానీ నేటికీ ఆ ఓటమి నుంచి వారు ఎటువంటి గుణపాఠం నేర్చుకోలేదని వారే నిరూపించుకొంటున్నారు. తెలంగాణాలో తెరాసకు ఏకైక ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీయేననే విషయంలో సందేహం లేదు కానీ ప్రతిపక్షాలో ఉన్నప్పుడు కూడా పదవుల కోసం కీచులాడుకోవడం చూస్తున్న ప్రజలు వారికి అధికారం కట్టబెట్టడానికి ఇష్టపడకపోవచ్చు. కనుక కాంగ్రెస్ నేతలు ముందుగా తమ అంతర్గత సమస్యలను పరిష్కరించుకొని ఆ తరువాత అధికారంలోకి రావడానికి ఏమి చేయాలో ఆలోచిస్తే మంచిది. లేకుంటే కర్నే ప్రభాకర్ చెప్పినట్లు 3019 కైనా వారు రాష్ట్రంలో అధికారంలోకి రాలేరు. 


Related Post