గవర్నర్ ను కలిసి ఏమి ప్రయోజనం?

September 20, 2017


img

తెలంగాణా రాష్ట్రంలో ప్రతిపక్షాలకు దిక్కుతోచని స్థితిలో ఉన్నట్లున్నాయి. తెరాస సర్కార్ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ కోర్టులకు వెళితే, ప్రతిపక్షాలు అభివృద్ధికి అడ్డుపడుతున్నాయని తెరాస నేతలు, మంత్రులు వాదిస్తారు. పోనీ..గవర్నర్ నరసింహన్ కు పిర్యాదులు చేస్తే ఆయన వాటిని పట్టించుకోరు. చివరకి రాష్ట్రపతికి పిర్యాదు చేసినా ఫలితం కనబడదు. శాసనసభ సమావేశాలలో తెరాస సర్కార్ ను గట్టిగా ఎదుర్కొందామంటే ఏదో వంకతో సభ నుంచి సస్పెండ్ చేసి బయటకు పంపించేస్తుంది. కనుక మిగిలిన ఏకైక మార్గం ప్రజలలోకి వెళ్ళి చెప్పుకోవడమే. అందుకే కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్రకు సిద్దం అవుతోంది. అయితే తమ ప్రయత్నలోపం ఉండకూడదనేమో..తెదేపా, భాజపా, న్యూడెమోక్రసీ, తెలంగాణ జెఎసి నేతలతో కలిసి కాంగ్రెస్ నేతలు గవర్నర్ నరసింహన్ ను కలిసారు. తెరాస సర్కార్ ఏర్పాటు చేస్తున్న రైతు సమన్వయ సమితుల వలన ఎదురయ్యే సమస్యలను, కలిగే నష్టాల గురించి వివరించి, వాటిని ఏర్పాటు చేయకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. 

అనంతరం రాజ్ భవన్ బయట భాజపా ఎమ్మెల్సీ రాంచందర్‌ రావు మీడియాతో మాట్లాడుతూ, “రైతు సమన్వయ సమితుల వలన రైతులకు ఏమీ ప్రయోజనం ఉండదు. తెరాస నేతలు, కార్యకర్తలకు మాత్రమే ఉంటుంది. అందుకే వాటి ఏర్పాటును మేము వ్యతిరేకిస్తున్నాము,” అని అన్నారు.

టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ మీడియాతో మాట్లాడుతూ, “ తెరాస సర్కార్ ఈ సమితులతో స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ తన నిరంకుశ పాలనను గ్రామాల వరకు విస్తరించేందుకే ఈ సమితులను ఏర్పాటు చేసుకొంటున్నారు. తెరాస సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అక్టోబర్ 2న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తాము,” అని చెప్పారు. 


Related Post