కమల్ కూడా రాజకీయాలలోకి?

September 13, 2017


img

ప్రముఖ తమిళ సినీనటుడు రజనీకాంత్ అనేక ఏళ్ళుగా రాజాకీయాలలోకి వస్తానని చెపుతున్నారు కానీ ధైర్యం చేయాలేకపోతున్నారు. పన్నీరు-పళని వర్గాలు కీచులాడుకొంటునప్పుడు ఆయన ఫోటో సెషన్స్ పేరిట చెన్నైలో తన  అభిమానులతో వరుసగా సమావేశాలు నిర్వహించడంతో అయన త్వరలో రాజకీయాలలోకి వస్తారనే అభిప్రాయం బలపడింది. తరువాత ఆయన సన్నిహితులు ఆ వార్తలను దృవీకరించారు కూడా. కానీ రోజులు గడుస్తున్నా మళ్ళీ ఆ ప్రస్తావన లేదు. 

సరిగ్గా ఇదే సమయంలో మరొక ప్రముఖ నటుడు కమల్ హాసన్ కూడా రాజకీయాలపై చాలా ఆసక్తి చూపించడం మొదలుపెట్టారు. దానితో ఆయన కూడా త్వరలోనే రాజకీయాలలో ప్రవేశించబోతునట్లు ఊహాగానాలు మొదలయ్యాయి. ఆయన వాటిని ఖండించలేదు సమర్ధించలేదు. కనుక మౌనం అర్ధాంగీకారం అని అందరూ భావిస్తున్నారు. ఆయన ఈనెల దసరా పండుగ రోజున లేదా అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున తన రాజకీయ ప్రవేశ ప్రకటన చేయవచ్చని ఈరోజు తమిళ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆయన ప్రతిపక్ష డిఎంకె పార్టీ వైపు కొంత మొగ్గు చూపినప్పటికీ స్వంతగా పార్టీ పెట్టుకోవాలని నిర్ణయించినట్లు ఆ వార్తల సారాంశం. 

ఈ వార్తలు నిజమే అయితే కమల్ హాసన్ చాలా ఆలస్యంగా తప్పు నిర్ణయం తీసుకొన్నారని చెప్పకతప్పదు. అదే..జయలలిత చనిపోయిన వెంటనే రాజకీయ ప్రవేశం చేసి ఉంటే ప్రజలందరి మద్దతు లభించేది కనుక ఆయన పని సులువు అయ్యేది. కానీ ఇప్పుడు పళని-పన్నీర్ వర్గాలు చేతులు కలిపి తమ ప్రత్యర్ధులను ఏరిపారేసి క్రమంగా బలపడుతున్న సమయంలో కమల్ హాసన్ రాజకీయ రంగప్రవేశం చేయడం వలన ఏ ప్రయోజనం ఉండకపోగా అన్ని విధాల దెబ్బ తినే ప్రమాదం ఉంటుంది. ఒకవేళ రజనీకాంత్ కూడా మరో పార్టీతో ఎంట్రీ ఇస్తే పరిస్థితులు ఇంకా దారుణంగా మారవచ్చు. ఇంతకీ వాళ్ళిద్దరూ హాయిగా సినిమాలు చేసుకోకుండా రాజకీయాలలో చేతులు కాల్చుకోవాలనుకొంటున్నారో? 


Related Post