నేతన్నలకే పెద్దన్న కేటిఆర్

September 12, 2017


img

ఒకప్పుడు తెలంగాణాలో అనేకమంది చేనేత, పవర్ లూమ్ కార్మికులు ఆర్ధిక ఇబ్బందును భరించలేక ఆత్మహత్యలు చేసుకొనేవారు. వారి సమస్యలను పరిష్కరించాలనే తపన, చిత్తశుద్ధి, మానవతా దృక్పధంతో స్పందించే గుణం ఉన్న కేటిఆర్ రాష్ట్ర చేనేత, జౌళి పరిశ్రమల మంత్రిగా బాధ్యతలు చేపట్టడం వారి అదృష్టమనే చెప్పాలి. గతంలో ఈ శాఖను ఉద్దండులైన నేతలే నిర్వహించారు. కానీ ఆ నేతన్నల కష్టాలు, కన్నీళ్లు, సమస్యలు ఎవరి కంటికి ఆనలేదు. కనుక ఎన్నడూ వాటిని పరిష్కరించే ప్రయత్నాలు చేయలేదు. కనీసం ఆ శాఖ అధికారులైన వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేసి ఉండి ఉంటే నేడు వారు ఇంత దుస్థితిలో ఉండేవారే కారు. 

ఇటువంటి పరిస్థితులలో కేటిఆర్ ఆ శాఖా మంత్రిగా బాధ్యతలు చేపట్టి, ఆ రోజు నుంచే నేతన్నల వద్దకు స్వయంగా వెళ్ళి వారి సమస్యలను అడిగి తెలుసుకొని వాటిని పరిష్కరించడం మొదలుపెట్టారు. ఆ ప్రయత్నాలలో భాగంగానే వారికి కోటికి పైగా బతుకమ్మ చీరలు నేసేందుకు అవకాశం కల్పించి వారికి చేతి నిండా పని, పనికి తగ్గ ప్రతిఫలమూ ముట్టేలా చేశారు. 

ఈరోజు వాటి పంపిణీ గురించి సంబంధిత అధికారులతో మంత్రి కేటిఆర్ చర్చిస్తున్నప్పుడు, ఇక నుంచి ప్రభుత్వాసుపత్రులు, ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలు, వివిధ ప్రభుత్వ శాఖల అవసరాలకు, రంజాన్, బతుకమ్మ, క్రిస్మస్ పండుగలకు అవసరమైన బట్టలు సరఫరా చేసేందుకు నేతన్నలకే ఆర్డర్ ఇవ్వబోతున్నట్లు తెలిపారు. బట్టల సరఫరాకు నిర్దిష్టమైన క్యాలెండర్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. దాని ప్రకారమే బట్టలు నేయడానికి, నేసినవాటిని కొనుగోలు చేయవలసి ఉంటుందని చెప్పారు. 

ప్రతీ నేతన్న కుటుంబానికి కనీసం నెలకు రూ.15,000 ఆదాయం తప్పనిసరిగా వచ్చేవిధంగా ఆర్డర్స్ ఇవ్వడానికి ప్రభుత్వం సంసిద్దంగా ఉందని తెలిపారు. చేనేత కార్మికుల ఆదాయం, ఖర్చులు, అప్పులు, వాటిపై వడ్డీలు వగైరా వివరాలన్నీ ఇప్పుడు ప్రభుత్వం వద్ద ఉన్నాయి కనుక వారి సంక్షేమం కోసం తగిన ప్రణాళికలను రూపొందిస్తుందని చెప్పారు. ఇక పవర్ లూమ్ కార్మికుల వివరాలను కూడా సేకరించి వారికోసం కూడా తగిన ప్రణాళికలు రూపొందించి అమలుచేస్తామని మంత్రి కేటిఆర్ తెలిపారు. జిల్లా కేంద్రాలలో, డిల్లీలోని తెలంగాణా భవన్ లో టెస్కో షోరూంలు తెరిచేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

గతంలో చేనేత శాఖ అంటే అదొక అప్రధాన్యశాఖ అని, కనుక అసమర్దులకే దానిని కేటాయిస్తారనే నిశ్చితాభిప్రాయం ఉండేది. ఎవరికీ పనికిరాదనుకొన్న అదే శాఖను రాష్ట్ర రాజకీయాలలో, ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్న కేటిఆర్ చేపట్టి దానితో ఏమి సాధించవచ్చో చేసి చూపించి, చేనేతకు మళ్ళీ మెల్లగా పూర్వ వైభవం కల్పిస్తున్నారు. అంటే ప్రజా ప్రతినిధులకు పనిచేయాలనే ఉత్సాహం, తపన, ప్రజలకు సేవ చేయాలనే కోరిక, చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఏ శాఖను చేపట్టినప్పటికీ ఇటువంటి గొప్ప ఫలితాలు సాధించి చూపవచ్చునని కేటిఆర్ నిరూపించి చూపుతున్నారు. కనుక మిగిలిన మంత్రులు కూడా ఆయనను ఆదర్శంగా తీసుకొని పనిచేయడం మొదలుపెడితే వారికీ, తెరాస సర్కార్ కు కూడా గొప్ప పేరు, ప్రజలలో ఆదరణ లభిస్తుంది. 


Related Post