తూచ్! నేను పార్టీలోనే ఉంటాను

September 12, 2017


img

తెలంగాణా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన మాటలతో చాలా వేడి పుట్టిస్తున్నారు. పిసిసి అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ఆయనను తక్షణం పదవిలో నుంచి తొలగించకపోతే తాను పార్టీని వీడి వెళ్ళిపోతామని నిన్ననే ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ తో అన్నారు. మళ్ళీ ఈరోజు మాట మార్చి “నేను పార్టీ వీడి వెళ్ళిపోతానని అనలేదు. ఉత్తం కుమార్ రెడ్డే నేను వెళ్ళిపోబోతున్నానని ప్రచారం చేయిస్తున్నారు” అని చెప్పడం విశేషం. 

“నేను పార్టీలోనే ఉంటూ (ఉత్తం కుమార్ రెడ్డితో) కొట్లాడుతాను,” అని చెప్పారు. మళ్ళీ అంతలోనే ఉత్తం కుమార్ రెడ్డిని ఆ పదవిలో కొనసాగించినట్లయితే వచ్చే ఎన్నికలలో నేను పోటీ చేయను. నా ట్రస్ట్ ద్వారా ప్రజలకు సేవ చేసుకొంటాను. సమయం వచ్చినప్పుడు మళ్ళీ వస్తాను,” అని చెప్పారు. అంటే ఉత్తం కుమార్ రెడ్డి కారణంగా పార్టీలో నుంచి వెళ్ళిపోవాలనుకొంటున్నారు కానీ ధైర్యం చేయలేకపోతున్నారని  స్పష్టం అవుతోంది. 

పనిలోపనిగా “కనీసం ఒక్క ఏడాదయినా పిసిసి పగ్గాలు నాకు అప్పగించాలని అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తున్నాను. నాకు ఇవ్వదలచుకోకపోయినా తెలంగాణా కోసం, పార్టీ కోసం పోరాడినవారికి అవకాశం కల్పించాలి,” అని అన్నారు. 

ఒక రాష్ట్రంలో లేదా దేశంలో రాజకీయపార్టీని నడిపించేవారికి అందరినీ కలుపుకొనివెళ్ళగలిగే నేర్పు, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా వ్యూహరచన చేసుకొంటూ పార్టీని ముందుకు నడిపించగల బలమైన నాయకత్వ లక్షణాలు చాలా అవసరం. కానీ కోమటిరెడ్డికి ఆ లక్షణాలు ఏవీ లేవు. ఉండి ఉంటే అడగకుండానే పదవులు ఆయన ఒళ్ళో వచ్చిపడేవి. అది గ్రహించకుండా పార్టీ రాష్ట్ర నాయకుడినే ఈవిధంగా బహిరంగంగా విమర్శిస్తూ పార్టీ పరువు తీస్తున్నారు. పైగా తన షరతులకు అధిష్టానం లొంగకపోతే పార్టీని విడిచి వెళ్ళిపోతానని బెదిరిస్తున్నారు. 

ఒక సమర్ధుడైన నాయకుడు మాట్లాడవలసిన పద్ధతి ఇది కాదు. ఇటువంటి మాటల వలన పార్టీ పగ్గాలు దక్కకపోగా పార్టీ నుంచి బహిష్కరించబడే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి. బహుశః కోమటిరెడ్డి అదే కోరుకొంటున్నట్లయితే ఇదే పద్దతిలో ఇంకా స్పీడుగా దూసుకుపోవచ్చు. 


Related Post