ఆ నోట్లకు కూడా ఆయువు ముగిసినట్లేనా?

July 26, 2017


img

గత ఏడాది నవంబరులో పాత రూ.1,000 నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో కేంద్రప్రభుత్వం రూ.2,000 నోట్లను ప్రవేశపెట్టినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. నల్లధనాన్ని అరికట్టడానికే నోట్లరద్దు అని చెప్పుకొంటూ మళ్ళీ నల్లధనం ఇంకా వేగంగా పెరిగేందుకు, ఇంకా సులువుగా దాచుకొనేందుకు వీలుకల్పించే రూ.2,000 నోట్లను ప్రవేశపెట్టడంతో అందరూ ఆలోచనలో పడ్డారు. దీని వెనుక మర్మమేమిటి? కేంద్రప్రభుత్వం ఏమి చేయబోతోంది? మళ్ళీ వాటిని ఇదే విధంగా హటాత్తుగా రద్దు చేస్తుందా? చేస్తే ఎప్పుడు చేస్తుంది? అప్పుడు మన పరిస్థితి ఏమిటి? అని నల్లకుభేరులు తలలు పట్టుకొని ఉంటారు.కానీ పాత నోట్ల రద్దు తరువాత వాటిని మార్చుకొనేందుకు ప్రభుత్వం చాలా తక్కువ గడువు విధించడంతో నల్లకుభేరులకు వేరే మార్గమేదీ లేక అందరూ తమ వద్ద ఉన్న నల్లదనాన్ని రూ.2,000 నోట్లరూపంలోకి మార్చేసుకొని ఊపిరి పీల్చుకొన్నారు.

ఆ తరువాత దేశవ్యాప్తంగా ఆదాయపన్ను శాఖ దాడులలో పట్టుబడిన వందల కోట్లు విలువగల రూ.2,000 నోట్లు ఆ అనుమానాలు నిజమేనని నిరూపించాయి. కనుక మళ్ళీ నల్లదనం పోగయిందనే సంగతి ప్రభుత్వానికే కాదు...సామాన్యులకు కూడా అర్ధం అయింది. బహుశః అందుకే రిజర్వ్ బ్యాంక్ మార్కెట్లోకి ఎంత నగదువిడుదల చేసినా నేటికీ నగదు కొరత నెలకొనే ఉందని చెప్పవచ్చు. 

ఈ సమస్యను అధిగమించడం కోసమని ప్రభుత్వం మళ్ళీ రూ.2,000 నోట్లను రద్దు చేస్తే దేశంలో ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకోవడమే కాకుండా ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉంది. కనుక రూ.2,000 నోట్ల ముద్రణను నిలిపివేసి ఉండవచ్చు. తద్వారా నల్లకుభేరులు తమ వ్యాపారలావవాదేవీలను నిర్వహించుకొనేందుకు తమ తిజోరీలలో బందీ చేసి ఉంచిన ఆ పెద్దనోట్లను తప్పనిసరిగా బయటకు తీయక తప్పదు. అవి బయటకు వస్తున్నపుడు కావాలనుకొంటే ప్రభుత్వం వాటిని మెల్లమెల్లగా ఉపసంహరించుకొనే అవకాశం కూడా ఉంది. అప్పుడు అతిపెద్ద నోటు రూ.500 అవుతుంది. వాటితో నల్లదనం బారీగా పోగేయడం కొంచెం కష్టం కూడా. కనుక వచ్చే ఎన్నికలలోగా దేశంలో రూ.2,000 నోట్లు పూర్తిగా కనబడకుండా మాయం అయినా ఆశ్చర్యం లేదు. బహుశః అందుకే ఆ ఓట్ల ముద్రణను నిలిపివేసి ఉండవచ్చు. 


Related Post