ఏదీ లేకనే నేరెళ్ళతో కాంగ్రెస్ హడావుడి

July 26, 2017


img

కాంగ్రెస్-తెరాసల మద్య కొత్తగా నేరెళ్ళలోని దళితుల అరెస్టుల అంశంపై యుద్ధం మొదలైంది. తెరాస పాలనలో దళితులు, బడుగుబలహీనవర్గాలపై దాడులు నిత్యకృత్యమైపోయాయని విమర్శలు కాంగ్రెస్ హయంలోనే చుండూరు, కారంచేడు ఘటనలు జరిగాయని మంత్రి కేటిఆర్ ప్రతివిమర్శలు చేశారు. ప్రస్తుతానికి కాంగ్రెస్ నేతలు వెర్సస్ మంత్రి కేటిఆర్ అన్నట్లుగా సాగుతోంది ఈ యుద్ధం. ఇది తీవ్రతరమయితే మరికొందరు తెరాస నేతలు కూడా దీనిలో జేరవచ్చు.

 నేరెళ్ళ ఘటనను సాకుగా చూపించి కాంగ్రెస్ పార్టీ పాదయాత్రలు, సిరిసిల్లాలో బహిరంగ సభకు సిద్దం అవుతుండటాన్ని మంత్రి కేటిఆర్ తప్పు పట్టారు. కాంగ్రెస్ నేతలకు మరే అంశం దొరకనందునే దీనిని హైలైట్ చేసి తమ ప్రభుత్వంపై బురద జల్లెందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. 

కేటిఆర్ కాంగ్రెస్ పార్టీని ముసలి నక్కతో పోల్చారు. దానిని యావత్ దేశ ప్రజలు తిరస్కరిస్తున్నా వారి బుద్ధులు, ఆలోచనలు మారడం లేదని అన్నారు. సీనియర్ కాంగ్రెస్ నేతలు జైరాం రమేష్, దిగ్విజయ్ కాంగ్రెస్ పార్టీకి పట్టిన చీడ అని అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీకి దేశాన్ని దోచుకోవడమే తప్ప మరేమీ తెలియదని కేటిఆర్ ఎద్దేవా చేశారు. 

రాష్ట్ర కాంగ్రెస్ నేతలు దళితులపై కపటప్రేమ ప్రదర్శిస్తున్నారని, వారిని కాంగ్రెస్ ఎప్పుడూ ఓటు బ్యాంకుగానే చూసింది తప్ప మనుషులుగా చూడలేదని అన్నారు. తమ ప్రభుత్వం వారికోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంటే వాటినీ కాంగ్రెస్ నేతలు విమర్శిస్తూ కాంగ్రెస్ నేతలు తమ అల్పబుద్దిని ప్రదర్శించుకొంటున్నారని అన్నారు. సిరిసిల్లలో కాంగ్రెస్ నేతలు బహిరంగ సభ నిర్వహిస్తే అక్కడి ప్రజలే వారికి తగినవిధంగా బుద్ధి చెపుతారని కేటిఆర్ అన్నారు. తన సన్నిహితులు రాష్ట్రంలో ఇసుక మాఫియా నడిపిస్తున్నారనే కాంగ్రెస్ ఆరోపణలపై కూడా కేటిఆర్ ఘాటుగా స్పందించారు. ఆ ఆరోపణలు రుజువు చేయాలని సవాలు విసిరారు. కాంగ్రెస్ హయంలో ఇసుక అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి కేవలం రూ.10 కోట్లు వస్తే, తెరాస సర్కార్ అమలుచేస్తున్న ఇసుక విధానం వలన ఈ మూడేళ్ళలో రూ.600 కోట్లు ఆదాయం వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ నేతలు ఇప్పటికైనా తమ నీచ రాజకీయ ఆలోచనా విధానాలను మార్చుకోకపోతే ప్రజలే వారికి తగిన విధంగా బుద్ధి చెపుతారని కేటిఆర్ అన్నారు. 

రాష్ట్ర కాంగ్రెస్ నేతలు మియాపూర్ భూకుంభకోణం గురించి కొన్ని రోజులు హడావుడి చేశారు. కానీ దానితో ప్రజలను ఆకట్టుకోలేకపోతున్నామని గ్రహించి ఆ అంశం పక్కన పడేసి ఇప్పుడు రాజకీయాలలో విజయవంతమైన ఫార్మూలాగా భావించబడుతున్న దళిత సమస్యలను భుజానికెత్తుకొని హడావుడి చేస్తూ తమ ఉనికిని చాటుకోవాలని ప్రయత్నిస్తున్నట్లున్నారు. అయితే నేటికీ వారు తమ రాజకీయ ఆలోచనా విధానాలను, ధోరణిని ప్రజలు ఆమోదించడం లేదని తెలిసి కూడా మూస పద్దతులలోనే ముందుకు సాగుతుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. 


Related Post