మీడియాకు వారి మాటలు వినబడవా?

July 25, 2017


img

మన దేశంలో మీడియాకు ఎప్పుడూ సెన్సేషనల్ న్యూస్ కావాలి. ప్రస్తుతం టాలీవుడ్ డ్రగ్స్ కేసులు దానికి చాలా జోష్ కలిగిస్తున్నాయి. దేనికి తోచిన స్టోరీ అది ప్రసారం చేసేస్తోంది...వ్రాసుకుపోతోంది. నిజానిజాలు ఏమిటో ఎవరికీ అక్కరలేదు. ఈరోజు ఒక హీరోను విచారణకు హాజరవుతుంటే..”ఆ హీరో గురించి మీకు తెలియని నిజాలు...” అనో లేదా “ఆ హీరోని సిట్ అధికారులు ఏమి ప్రశ్నించారంటే...” అంటూ అవసరం ఉన్నవీ లేనివీ వండి వార్చేస్తోంది. వారందరూ సెలబ్రెటీలు కావడమే వారు చేసిన పాపం. వారికి నిజంగా డ్రగ్స్ అలవాటు ఉందో లేదో..వారు దోషులో కాదో నిర్ధారించవలసినది సిట్ బృందం. కానీ మన మీడియా జడ్జీ కుర్చీలో కూర్చొని ముందే జడ్జిమెంట్ ఇచ్చేస్తుంటుంది. రామ్ గోపాల్ వర్మ వంటివారు సినీపరిశ్రమలో వారిని విచారిస్తే తెలంగాణా రాష్ట్రానికి అప్రదిష్ట కలుగుతోందని వాదిస్తుంటారు. ఈవిధంగా మీడియా చేస్తున్న అతివలన నోటీసులు అందుకొన్నవారు..వారి కుటుంబాలు చాలా ఆవేదన చెందుతున్నారని, కనుక కాస్త సంయమనం పాటించమని దర్శకుడు పూరీ జగన్నాథ్ విజ్ఞప్తి చేశాడు. కానీ మీడియా పట్టించుకోలేదు. ఈరోజు విచారణకు హాజరైన నవదీప్ విచారణ గురించి చిలువలు పలువలు అల్లేసి వ్రాసి పడేసింది. 

వాటిని చూసి నవదీప్ కూడా తీవ్ర ఆగ్రహం ఆవేదన వ్యక్తం చేశాడు. మీడియాకు వాస్తవాలను వక్రీకరించి వ్రాయడమే తప్ప ప్రభుత్వ సంస్థలపై, దర్యాప్తు సంస్థపై ఏమాత్రం గౌరవం లేనట్లు కనబడుతోందని ట్వీట్ చేశారు. కొన్ని మీడియా సంస్థలకు ప్రజలకు వివేకం, ఆలోచించే శక్తి లేదని భావిస్తున్నట్లు వారిని రంజింపజేయడానికి నిరాధారమైన కధనాలు అల్లి ప్రచురిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. 

కనీసం ఇప్పటికైనా మీడియా ఈ డ్రగ్స్ కేసులో స్వీయ నియంత్రణ పాటిస్తే గౌరవంగా ఉంటుంది కదా!             



Related Post