చైనాకు భారత్ తల వంచినట్లేనా?

June 10, 2017


img

పాక్ ఆక్రమిత కాశ్మీర్ గుండా నిర్మిస్తున్న‘వన్‌ బెల్ట్, వన్‌ రోడ్‌’ ను భారత్ ఎంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ చైనా ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. చైనాకు రాజ్య విస్తరణ కాంక్ష ఎక్కువ. అది మనకంటే అన్నివిధాల బలంగా ఉండటం చేత దాని దుశ్చర్యలను భారత్ గట్టిగా తిప్పికొట్టలేకపోతోంది. ఇంత జరుగుతున్నా భారత్ ఆర్ధిక వ్యవస్థను, భారత పరిశ్రమలను చావుదెబ్బ తీస్తున్న చైనా ఉత్పత్తులను నిషేదించే సాహసం భారత్ సర్కార్ చేయలేకపోతోంది. ‘ఐ లవ్ మై ఇండియా’ అని గొప్పగా చెప్పుకొనే భారతీయులు కూడ మన దేశాన్ని చావుదెబ్బ తీస్తున్న చైనా వస్తువులపైనే మోజు పడుతుండటం విచారకరం. 

ఈ నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం కజకిస్తాన్ లో అస్తానా నగరంలో జరిగిన షాంఘై సహకార సంస్థ సదస్సులో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ లతో చాలా చక్కగా మాట్లాడటం విశేషం. అంతర్జాతీయ సదస్సులలో దౌత్యపరంగా ఆవిధంగా వ్యవహరించక తప్పదు కనుక మోడీని ఎవరూ తప్పు పట్టలేరు. ఆ తరువాత వారివురి సమక్షంలోనే ప్రధాని మోడీ మాట్లాడుతూ, “ఎస్.సి.ఒ.లోని సభ్యదేశాలన్నీ తోటి సభ్యదేశాల సార్వభౌమత్వం, భౌగోళిక సమగ్రతను పరస్పరం గౌరవించుకోవాలి. ఉగ్రవాదాన్ని నిరోదించడానికి అన్ని ప్రయత్నాలు చేయాలి” అంటూ ఇంకా చాలా విషయాల గురించి మాట్లాడారు.

అయితే ఈ నీతిబోధలు..ఇటువంటి ప్రసంగాలతో చైనా, పాక్ దుశ్చర్యలు మానుకొంటాయా? అంటే కాదనే చెప్పవచ్చు. అంతర్జాతీయ వేదికలపై దౌత్య సంప్రదాయాలను గౌరవించవలసి ఉంటుంది కనుక ఆ దేశాల పేర్లను ప్రస్తావించి వాటి దుశ్చర్యలను ఖండించడం కూడా సాధ్యం కాదు. సభ్యదేశాలకు కూడా ఈ సమస్యల గురించి తెలిసి ఉన్నప్పటికీ అవి కూడా మాట్లాడవు. కనుక ఇటువంటి వేదికలలో దేశాధినేతల మాటలకు, చేతలకు ఎటువంటి సంబంధమూ ఉండదని, ఆ ప్రసంగాలతో ధూర్తదేశాల తీరులో ఎటువంటి మార్పురాదనే స్పష్టం అవుతోంది. కానీ ప్రధాని మోడీ వాటి చర్యలను (పరోక్షంగా) ఖండించడమే చాలా గొప్ప విషయమన్నట్లు మన మీడియా వ్రాసుకొని సంతృప్తి పడుతుంది. భారత్ పట్ల చైనా, పాక్ దేశాలు ఎంత అనుచితంగా ప్రవర్తిస్తున్నప్పటికీ వాటితో గౌరవంగా ప్రవర్తించవలసిరావడం మన సంస్కారమా లేక ఓటమా? ఆలోచించుకోవాలి.


Related Post