రిజిస్ట్రేషన్లు అక్కడ..వ్యాపారం ఇక్కడ..

June 10, 2017


img

ఆర్టీసి బస్సులు 90-100 ఆక్యుపెన్సీతో తిరుగుతున్నా ఎప్పుడూ నష్టాలలో కూరుకుపోతుంటాయి కానీ ప్రైవేట్ ట్రావెల్స్ 50-60 శాతం ఆక్యుపెన్సీతో కూడా లాభాలు ఆర్జిస్తుంటాయి! నానాటికీ పెరుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులే అందుకు సజీవ సాక్ష్యం. ఇది ఎలా సాధ్యం? అంటే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యజమానులు చేస్తున్న ఈ మాయల గురించి తెలుసుకోక తప్పదు. 

ఈశాన్య రాష్ట్రాలలో ఒకటైన అరుణాచల్ ప్రదేశ్ ప్రధానంగా పర్యాటక రంగం మీద ఆధారపడుతుంది. కనుక పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో అక్కడ 2+1 స్లీపర్ కోచ్ ప్రైవేట్ ట్రావెల్ బస్సులకు అతి తక్కువ రిజిస్ట్రేషన్, పర్మిట్ ఛార్జీలు తీసుకొంటుంది. ఈ సంగతి కనిపెట్టిన రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యజమానులు అక్కడ తమ బస్సులను రిజిస్ట్రేషన్ చేయించుకొని, పర్మిట్స్ తీసుకొని వాటిని ఇక్కడ ఏపి, తెలంగాణా రాష్ట్రాలలో దర్జాగా తిప్పుకొంటున్నారు.

ఈవిధంగా చేయడం వలన రెండు తెలుగు రాష్ట్రాలలో రవాణాశాఖలు రిజిస్ట్రేషన్, పర్మిట్స్ ద్వారా రావలసిన ఆదాయాన్ని కోల్పోతున్నప్పటికీ, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు అరుణాచల్ ప్రదేశ్ రవాణాశాఖ నుంచి అన్ని దృవపత్రాలు కలిగి ఉన్నందున అధికారులు ఏమీ చేయలేకపోయేవారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రైవేట్ ట్రావెల్స్ లో చాలా వరకు ఆంధ్రాకు చెందిన కొందరు అధికారపార్టీ నేతల చేతిలోనే ఉండటం వలన ఈ ఘరానా మోసం నిరంతరంగా సాగిపోయింది. ఈ మోసం గురించి తెలిసినా రవాణాశాఖ అధికారులు అప్పుడే ఆ రాష్ట్రానికి ఎందుకు పిర్యాదు చేయలేదో తెలియదు. 

ఇటీవల కేశినేని ట్రావెల్స్ అధినేత మరియు తెదేపా ఎంపి కేశినేని నాని కొన్ని కారణాల వలన తన ట్రావెల్స్ వ్యాపారాన్ని మూసివేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాతే తెదేపా నేత ఒకరు ఎవరో అరుణాచల్ ప్రదేశ్ రవాణాశాఖకు పిర్యాదు చేయడంతో తక్షణమే స్పందించి రెండు తెలుగు రాష్ట్రాలలో తిరుగుతున్న సుమారు 400 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల రిజిస్ట్రేషన్లు, పర్మిట్లు రద్దు చేసింది. త్వరలో ఆ ఉత్తర్వులు ఏపి, తెలంగాణా రవాణాశాఖాలకు పంపించబోతున్నట్లు తెలియజేసింది. అది రాగానే అరుణాచల్ ప్రదేశ్ రిజిస్ట్రేషన్, పర్మిట్స్ తో తిరుగుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై చర్యలు తీసుకొనేందుకు రవాణాశాఖ అధికారులు సిద్దం అవుతున్నారు. 


Related Post