ఆ సిఎం చేతులు ఎత్తేసినట్లేనా?

June 09, 2017


img

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివారాజ్ సింగ్ చౌహాన్ రేపటి నుంచి నిరవధిక నిరాహారదీక్షకు కూర్చొంటానని ప్రకటించారు. రాష్ట్రంలో శాంతి నెలకొనే వరకు తన దీక్ష కొనసాగిస్తానని చెప్పారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని దసరా మైదానంలో దీక్ష చేపడతానని చెప్పారు. ప్రజలు నేరుగా తన వద్దకు వచ్చి సమస్యలను చెప్పుకోవచ్చని చెప్పారు. అక్కడి నుండే రాష్ట్రాన్ని పాలిస్తానని చెప్పారు. 

శివారాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్ర వ్యవసాయరంగంలో అనేక మార్పులు తీసుకువచ్చిన వ్యక్తిగా మంచి గుర్తింపు కలిగి ఉన్నారు. ఇంకా పాలనాపరంగా కూడా అనేక సంస్కరణలు చేపట్టినందుకు ప్రధాని నరేంద్ర మోడీ సైతం ఆయనను అభిమానిస్తారు. అటువంటి సమర్ధుడైన ముఖ్యమంత్రి రాష్ట్రంలో రైతులు ఆందోళనబాట పట్టినప్పుడు, పరిస్థితులు చెయ్యి దాటిపోయేవరకు ఎందుకు ఉపేక్షించారో తెలియదు. ఇప్పుడైనా పరిస్థితులను వేగంగా అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు చేయకుండా ఈవిధంగా యుద్ధం మద్యలో అస్త్రసన్యాసం చేసినట్లు నిరాహార దీక్షకు కూర్చోవడం చాలా విడ్డూరంగా ఉంది.

ఈ సమస్యను పరిష్కరించవలసిన బాధ్యత తన మీదే ఉన్నప్పుడు చొరవ తీసుకొని దానిని పరిష్కరించే ప్రయత్నం చేయాలి గానీ ఈవిధంగా నిరాహార దీక్ష చేస్తే సమస్య దానంతట అదే పరిష్కారం అయిపోతుందా? లేక ప్రతిపక్షాలు వెనక్కు తగ్గుతాయా? బహుశః రైతులకు తనపై అమితమైన గౌరవం ఉందని శివారాజ్ సింగ్ నమ్ముతున్నందున వారిని నియంత్రించడానికే ఇంత విచిత్రమైన నిర్ణయం తీసుకొన్నారా లేక ఏమీ చేయలేక నిరాహార దీక్ష చేస్తున్నారా అనే ప్రశ్నకు రానున్న రోజులలో జరుగబోయే పరిణామాలే సమాధానాలు చెప్పాలి.


Related Post