వెంకయ్య చెప్పింది బాగానే ఉంది కానీ..

June 09, 2017


img

భాజపా పాలిత మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పంట రుణాలను మాఫీ చేయాలని, పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని కోరుతూ రైతులు చేస్తున్న ఆందోళనలు, తదనంతర పరిణామాలపై కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ, “ ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న  సమస్యలు ఇప్పుడు ప్రధాని మోడీ సృష్టించినవో లేదా భాజపా సృష్టించినవో కావు. చిరకాలంగా ఉన్నవే. రైతుల ఆందోళన సహేతుకమైనదే కానీ పంట రుణాల మాఫీయే అన్ని సమస్యలకి పరిష్కారం కాదు. రైతులు దుక్కి దున్నే సమయం నుంచి పండించిన పంటలను అమ్ముకొనేవరకు అనేక దశలలో అనేక రకాల సహాయసహకారాలు అవసరం అందించవలసి ఉంటుంది. అప్పుడే రైతులు ఈ సమస్యల నుంచి బయటపడగలుగుతారు.

గత కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో అన్ని రంగాలతో బాటు వ్యవసాయాన్ని కూడా భ్రష్టు పట్టించేసింది. మేము అధికారంలోకి వచ్చేక రైతులకు మేలు కలిగించే అనేక నిర్ణయాలు తీసుకొన్నాము. ఇంకా అనేక ఏర్పాట్లు చేస్తున్నాము. మా పని మేము చేసుకుపోతున్నాము కానీ అవన్నీ పూర్తయ్యేసరికి 3-4 ఏళ్ళు పట్టవచ్చు. ఈలోగా మేము చేపట్టిన అనేక చర్యల వలన దేశంలో రైతులకు కొన్ని ప్రయోజనాలు అందుతున్నాయి. రైతులకు మా ప్రభుత్వం వీలైనంత సహాయసహకారాలు అందిస్తోంది. కనుక రైతుల సమస్యలను రాజకీయాలు చేయాలని ప్రయత్నించకుండా ప్రతిపక్షాలు మాతో కలిసివస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి,” అన్నారు. 

రెండు తెలుగు రాష్ట్రాలలో పంట రుణాల హామీలను ఇచ్చి తెదేపా, తెరాసలు అధికారంలోకి రావడం చూసి భాజపా కూడా తమకు చాలా కీలకమైన ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో రైతులకు పంట రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి రాగలిగింది. పంట రుణాల మాఫీయే అన్ని సమస్యలకు పరిష్కారం కాదని ఇప్పుడు చెపుతున్న వెంకయ్య నాయుడు అప్పుడు యూపిలో వద్దని వారించలేదు. అప్పటి నుంచే మెల్లమెల్లగా అన్ని రాష్ట్రాలలో పంట రుణాల మాఫీకి ఆందోళనలు మొదలయ్యాయి. మొదట తమిళనాడు రైతులు డిల్లీలో ఆందోళనలు చేశారు. ఇప్పుడు మధ్యప్రదేశ్ లో రైతులు చేస్తున్నారు. యుపిలో రైతులు కూడా తమ పంట రుణాలను తక్షణం మాఫీ చేయాలని లేకుంటే తాము కూడా ఆందోళన మొదలుపెడతామని యోగీ సర్కార్ కు ఈ మద్యనే వార్నింగ్ ఇచ్చారు. 

రాజకీయ పార్టీలు ఎన్నికలలో గెలిచి అధికారంలోకి రావడం కోసం ఈవిధంగా పంట రుణాల మాఫీని రైతులకు ఎరగా వేస్తున్నాయని స్పష్టం అవుతోంది. తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రూ.2 లక్షలు పంట రుణాలను ఒకేసారి మాఫీ చేస్తామని పదేపదే చాటింపు వేస్తుండటమే ఇందుకు మరో తాజా ఉదాహరణ. ఈ సమస్యను సృష్టించింది రాజకీయ పార్టీలే కానీ రైతులు కాదని అర్ధం అవుతోంది. కనుక దీనిని పరిష్కరించవలసిన బాధ్యత కూడా వాటిదే. 

కానీ ఆ హామీలను నిలబెట్టుకోమని రైతులు అడిగినప్పుడు సమస్యలు, నియమనిబంధనలు వల్లించి చివరికి కాల్పులు జరపడానికి కూడా ప్రభుత్వాలు వెనుకాడటం లేదు. కనుక తప్పంతా రాజకీయ పార్టీలదే కానీ రైతులది కాదు.


Related Post