చంద్రబాబు గాలి తీసేసిన జేసి

June 09, 2017


img

ఏపి సిఎం చంద్రబాబు నాయుడు ఈరోజు చాలా ఉత్సాహంగా అనంతపురం జిల్లాలో రాయదుర్గంలో ఏరువాక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినప్పుడు ఆ జిల్లా తెదేపా నేత జేసి దివాకర్ రెడ్డి తన మాటలతో ఆయన గాలి తీసేయడం విశేషం. పోలవరం ప్రాజెక్టుకు జగన్మోహన్ రెడ్డి అడ్డుపడుతున్నారని కానీ తాను డిశంబర్ 2018 కల్లా పూర్తి చేసి నీళ్ళు అందిస్తానని చంద్రబాబు తరచూ చెపుతుంటారు. అలాగే ప్రతిపక్షాలు కుళ్ళుకొనేలే ప్రపంచస్థాయి రాజధాని నిర్మించి చూపుతానని చెపుతుంటారు. రాయదుర్గంలో ఏర్పాటు చేసిన సభలో కూడా ఇంచుమించు ఇవే మాటలు చెప్పారు. ఆ తరువాత మాట్లాడిన జేసి “మాకు అమరావతితో అసలు పనిలేదు కానీ పోలవరం పూర్తిచేస్తే చాలు. దానిని 2020 నాటికి కూడా పూర్తి చేయడం సాధ్యం కాదు. కానీ ఇదే వేగంతో పనులు జరిగినట్లయితే అది పూర్తికావడానికి మరో నాలుగైదేళ్ళయినా పడుతుంది. చంద్రబాబు నాయుడు పాపం చాలా కష్టపడుతున్నారు కానీ ఆయనకు దేవుడు కూడా సహకరించడం లేదు. దళారుల చేతిలో రైతులు మోసపోతున్నారు. కనుక రైతులను ఆదుకోవాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.

చంద్రబాబు నాయుడు రాయలసీమకు చెందిన వారైనప్పటికీ సీమ జిల్లాలను పట్టించుకోకుండా ఎంతసేపు అమరావతి, ఉభయ గోదావరి, విశాఖ జిల్లాల అభివృద్ధి గురించే ఆలోచిస్తుంటారనే సీమ ప్రజల అభిప్రాయమే జెసి దివాకర్ రెడ్డి మాటలలో చూచాయగా కనబడుతోంది. తను కూడా తెదేపాలో ఉన్నాననే ఆలోచనతోనే ఆయన చాలా ఆచితూచి జాగ్రత్తగా ఆ మాటలన్నారు. చంద్రబాబు నాయుడుకి ఆయన అభిప్రాయం అర్ధం కాలేదనుకోలేము. కానీ పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. అందుకే సీమ ప్రజలు, నేతలలో బాబు పాలనపట్ల అసంతృప్తి నెలకొని ఉంది. వారి అసంతృప్తిని పట్టించుకోకపోతే చివరికి నష్టపోయేది తెదేపాయే.   


Related Post