సింగరేణిలో తెరాసకు అప్పుడు జేజేలు ఇప్పుడు...

June 09, 2017


img

వారసత్వ ఉద్యోగాలను కల్పించాలని కోరుతూ సింగరేణిలో దాదాపు అన్ని ప్రధాన కార్మిక సంఘాలు ఈనెల 15 నుంచి సమ్మెకు సిద్దం అవుతున్నాయి. ప్రభుత్వమే స్వయంగా దాని కోసం నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ కోర్టు అంగీకరించడంలేదంటూ వెనక్కి తగ్గడం సరికాదని కార్మికసంఘాల వాదన. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనవలసిన భాద్యత ప్రభుత్వంపైనే ఉందని కానీ ఈ విషయాన్ని అది అసలు పట్టించుకోవడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్య పరిష్కారం చేయమని ప్రభుత్వాన్ని ఎంతగా ప్రాధేయపడ్డా ఫలితం లేకపోవడం చేతనే సమ్మెకు దిగవలసి వస్తోందని హెచ్.ఎం.ఎస్., ఎ.ఐ.టి.యు.సి., ఐ.ఎన్.టి.యు.సి. నేతలు చెప్పారు. కానీ గుర్తింపు కార్మిక సంఘం నేతలు యాజమాన్యంతో కుమ్మక్కయ్యి తమ సమ్మెను విచ్చినం చేయడానికి కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. వారిని ఎదుర్కొని సమ్మెతో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి అన్ని సమస్యలను పరిష్కరించుకొంటామని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న తమకు కార్మికులు అందరూ సహకరించాలని వారు కోరారు. ఈ సందర్భంగా వారు గోదావరిఖనిలో గురువారం సమ్మె పోస్టర్ లను ఆవిష్కరించారు. 

వారసత్వ ఉద్యోగాలు కల్పిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసినప్పుడు సింగరేణి కార్మికులు అందరూ ముక్తకంఠంతో తెరాస సర్కార్ కు జేజేలు పలికారు. కానీ దానిపై కోర్టు తీర్పులు వ్యతిరేకంగా వచ్చిన తరువాత తెరాస సర్కార్ ఇక ఈ వ్యవహారంతో తమకు అసలు సంబంధమే లేదన్నట్లు వ్యవహరిస్తుండటం వలన దాని నిజాయితీని శంఖించవలసి వస్తోంది. కార్మిక సంఘాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే తెరాస సర్కార్ ఆ జివో జారీ చేసింది తప్ప తెరాసకు నిజంగా కార్మికుల సంక్షేమంపై ఏమాత్రం ఆసక్తి లేదని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. ఇప్పుడు కార్మిక సంఘాలు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేస్తూ సమ్మెకు కూడా సిద్దం అవుతున్నాయి.

ఆనాడు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు తెరాస సర్కార్ కు వచ్చిన మంచిపేరు దాని నిరాసక్తతతో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయి దాని స్థానంలో కార్మికులలో వ్యతిరేకత పెరుగుతోందని ఈ సమ్మె సూచిస్తోంది. కనుక తెరాస సర్కార్ ఇప్పటికైనా అప్రమత్తం అయ్యి ఈ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నాలు మొదలుపెడితే మంచిదేమో? 


Related Post