వైకాపాకు తెదేపా బాగానే చెక్ పెట్టింది కానీ..

June 08, 2017


img

మొన్న కురిసిన కొద్దిపాటి వానలకు వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక శాసనసభ భవనంలో చాలా చోట్ల సీలింగులో నుంచి నీళ్ళు కారాయి. గోడలు బీటలువారాయి. ఒకచోట గోడ పాక్షికంగా కూలిపోయింది. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కార్యాలయంలో నీళ్ళు కారిపోయి సీలింగ్ ఊడిపడింది. దీనిపై తెదేపా, వైకాపాల మద్య జరిగిన రభస గురించి అందరికీ తెలిసిందే.

వైకాపాకు చెందిన వారే ఎవరో పైనున్న ఒక పైపును రంపంతో కోసివేసి ఈ కుట్రకు పాల్పడి ఉండవచ్చని తెదేపా ఆరోపిస్తోంది. దీనిపై సి.ఐ.డి. దర్యాప్తుకు ఆదేశించింది కూడా. అయితే శాసనసభ, సచివాలయంలో మిగిలిన చోట్ల కూడా నీళ్ళు లీక్ అయ్యాయి కదా? మరి దానికి ఎవరు బాధ్యులు? అని వైకాపా ఎదురు ప్రశ్నిస్తోంది. 

తాత్కాలిక సచివాలయం, శాసనసభ భవనాల గురించి తెదేపా నేతలు చాలా గొప్పలు చెప్పుకొన్నందున ఈ లీకేజీ వ్యవహారం ప్రభుత్వానికి తీరని అప్రదిష్ట కలిగించింది. అంతే కాదు.. రూ.1500 కోట్ల పైగా ఖర్చు చేసి నిర్మించిన ఆ రెండు భవనాలు చాలా నాసిరకంగా నిర్మించారనే విషయం బయటపడింది. ప్రభుత్వం చెల్లించిన డబ్బుకు తగ్గ నాణ్యత కనిపించకపోవడంతో ఈ నిర్మాణ వ్యవహారంలో అవినీతి కూడా జరిగి ఉండవచ్చని వైకాపా నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ వాదోపవాదాలలో ప్రస్తుతం తెదేపా పైచెయ్యి సాధించినప్పటికీ, ఇక నుంచి సుమారు 2-3 నెలల పాటు ఏకధాటిగా వానలు పడితే వాటిని ఆ రెండు భవనాలు తట్టుకొని నిలబడగలవా? లేకపోతే అప్పుడు తెదేపా సర్కార్ ఎవరిని నిందిస్తుంది? నాసిరకంగా భవనాలను నిర్మించిన కాంట్రాక్టర్లనా? లేక వైకాపా నేతలనా? అప్పుడు ఏవిధంగా తన తప్పును కప్పిపుచ్చుకొంటుంది? చూడాలి.      



Related Post