ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తావన ఎందుకో?

June 08, 2017


img

తెలంగాణా రాష్ట్రంలో ఐ.టి.ఐ.లలో సీట్లను ఆన్ లైన్ ద్వారా భర్తీ చేసే విధానాన్ని రాష్ట్ర హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి బుధవారం సచివాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, “ఒకప్పుడు సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి ‘తెలంగాణాకు ఒక్క రూపాయి కూడ ఇవ్వనని..ఏమి చేస్తారో చేసుకోండి..’  అని శాసనసభలో చాలా అహంకారంతో మాట్లాడారు. ఇప్పుడు మా రాష్ట్రంలో ప్రతీ రంగానికి మేమే కావలసినన్ని నిధులు కేటాయించుకొంటున్నాము. ఇప్పుడు నీ దిక్కున చోట చెప్పుకో,” అని నాయిని అన్నారు. నీళ్ళు, నిధులు, నియామకాల కోసమే కోట్లాది తెలంగాణా సాధించుకొన్నామని చెప్పారు. 

కిరణ్ కుమార్ రెడ్డి ఆరోజు ఆవిధంగా అనడం నిజమే..చాలా తప్పే. కానీ ఇప్పుడు నాయిని ఆ ప్రస్తావన చేయడం కూడా అసందర్భమే. ఎందుకంటే ఆయన రాజకీయ సన్యాసం చేసి మూడేళ్ళు అవుతోంది. మళ్ళీ రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో ఎన్నడూ జోక్యం చేసుకోలేదు. కానీ ఇప్పుడు అదే విషయాలపై అంటే నీళ్ళు, నిధులు, ఉద్యోగాల గురించి రాష్ట్రంలో ప్రతిపక్షాలు, టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ వంటి ప్రజాసంఘాల నేతలు తెరాస సర్కార్ ను నిలదీస్తున్నారు. ఎన్నికల హామీలను ఇంకా ఎప్పుడు అమలుచేస్తారు? లక్ష ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు? అంటూ ప్రశ్నిస్తున్నాయి. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వన్నినని చెపితే, ఇప్పుడు తెరాస సర్కార్ హామీల అమలుచేయకుండా కాలక్షేపం చేస్తోందని అర్ధం అవుతోంది. కనుక నాయిని కిరణ్ కుమార్ రెడ్డిని నిందించడం కంటే ప్రతిపక్షాలు అడుగుతున్న ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలిగితే బాగుంటుంది కదా! 


Related Post