కేసీఆర్, మోడీ దొందూ దొందే: ఉత్తంకుమార్ రెడ్డి

June 08, 2017


img

ప్రజలను, రైతులను మోసగించడంలో ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోడీ ఇద్దరూ ఒకరిని మించిన వారు మరొకరని పిసిసి అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి అన్నారు. మద్యప్రదేశ్ లో పోలీసులు కాల్పులలో ఆరుగురు రైతులు మృతి చెందడంపై ఉత్తం కుమార్ రెడ్డి స్పందిస్తూ, “మధ్యప్రదేశ్ లోని భాజపా ప్రభుత్వం రైతుల సమస్యలను విని పరిష్కరించకుండా రైతులపై కాల్పులు జరిపి వారి నోళ్ళు మూయించాలని ప్రయత్నించడం చాలా దారుణం. డిల్లీలో మోడీ ప్రభుత్వం కూడా రైతుల పట్ల చాలా నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తుంటుంది. పంటలకు భీమా కల్పించామని గొప్పలు చెప్పుకొంటుంది. కానీ పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందదు. నకిలీ విత్తనాల వలన రీతులు నష్టపోతున్నారని తెలిసినా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవు. మధ్యప్రదేశ్ లోని భాజపా ప్రభుత్వం రైతులపై కాల్పులు జరిపిస్తే ఇక్కడి తెరాస సర్కార్ గిట్టుబాటు ధర అడిగిన రైతులపై కేసులు పెట్టి జైళ్ళకు పంపిస్తుంది. రైతుల చేతులకు సంకెళ్ళు వేస్తుంది. తెలంగాణాలో మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రంలో రైతులందరికి రూ.2 లక్షల వరకు పంట రుణాలను ఒకేసారి మాఫీ చేస్తుంది. అంతే కాదు.. కేంద్రప్రభుత్వం ప్రకటించే గిట్టుబాటు ధరకు అదనంగా పంటలకు బోనస్ కూడా ఇస్తాము,” అని అన్నారు.

 తెరాస, భాజపా, ఎన్డీయే ప్రభుత్వాలు రైతు వ్యతిరేకమని వాదిస్తున్న ఉత్తం కుమార్ రెడ్డి, గతంలో తమ ప్రభుత్వ హయాంలో దేశ వ్యాప్తంగా వేలాదిమంది రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకొన్నారో వివరించి ఉండి ఉంటే బాగుండేది. తెరాస సర్కార్ లక్ష రూపాయల పంట రుణాలను వాయిదాల పద్దతిలోనే మాఫీ చేయడానికి మూడేళ్ళు సమయం తీసుకొంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఒకేసారి రూ.2 లక్షలు ఏవిధంగా తీర్చగలదో ఉత్తం కుమార్ రెడ్డి వివరిస్తే బాగుండేది. 

అనేక దశాబ్దాలుగా మహరాష్ట్రలో లాతూర్ లో ప్రజలు నీళ్ళకి కటకటలాడిపోతుంటే యూపియే ప్రభుత్వం అది తమకు సంబంధం లేని విషయం అన్నట్లు ఉండేది. కానీ మోడీ ప్రభుత్వం లాతూర్ కు రైల్వే వేగన్లతో నెలల తరబడి మంచి నీళ్ళు సరఫరా చేసింది. నకిలీ విత్తనాలను తయారు చేసే కంపెనీలపై కటిన చర్యలు తీసుకొనేందుకు బలమైన చట్టాన్ని చేసింది. దేశవ్యాప్తంగా దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న అనేక సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయిస్తోంది. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఏపిలో పోలవరం ప్రాజెక్టు కనబడుతోంది. కనుక కాంగ్రెస్ వాదనలను, హామీలను నమ్మలేము. 


Related Post