తెరాస సర్కార్ పై ప్రతిపక్షాలు మియాపూర్ అస్త్రం?

June 08, 2017


img

మియాపూర్ భూకుంభకోణం తెరాస సర్కార్ కు తీరని అప్రదిష్ట కలిగించగా, అదే ప్రతిపక్షాలకు బలమైన ఆయుధంగా అందివచ్చింది. సమైక్య రాష్ట్ర మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, దేవిరెడ్డి సుదీర్ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్, భిక్షపతి యాదవ్ తదితరులు కలిసి బుధవారం హైదరాబాద్ లోని ఐ.జి.ఆర్.ఎస్. కార్యాలయానికి వెళ్ళి కమీషనర్ కు వినతిపత్రం సమర్పించారు. మియాపూర్ భూకుంభకోణంలో ఎవరెవరి పేరిట భూములు రిజిస్ట్రేషన్ అయ్యాయో వారి పేర్లు, వివరాలను బయటపెట్టాలని కోరారు.

అనంతరం సబితా ఇంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “ఈ కుంభకోణంపై తెరాస సర్కార్ సి.ఐడి. విచారణకు ఆదేశించి దోషులను తప్పించే ప్రయత్నం చేస్తోందని మాకు అనుమానం కలుగుతోంది. రూ.15,000 కోట్లు కుంభకోణం బయటపడినా ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిపై ఎందుకు నోరు విప్పడం లేదు? ఈ కుంభకోణంలో డిప్యూటీ సిఎం కార్యదర్శి జాన్ వెస్లీపై ఆరోపణలు వస్తున్నా ఆయన పాత్రపై ఎందుకు ప్రభుత్వం విచారణ జరపడం లేదు? ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? సిబిఐ చేత దర్యాప్తు జరిపిస్తే దోషులెవరో తెలుస్తుంది కనుక తక్షణం సిబిఐ దర్యాప్తును కోరాలని మేము డిమాండ్ చేస్తున్నాము,” అని అన్నారు. 

కాంగ్రెస్ తరువాత ఇవ్వాళ్ళ నాగం జనార్ధన్ రెడ్డి తదితర భాజపా నేతలు మియాపూర్ భూముల పర్యటనకు బయలుదేరుతున్నారు. వారు కూడా తెరాస సర్కార్ పై ఇదేవిధంగా విమర్శలు గుప్పించేందుకే అక్కడికి బయలుదేరుతున్నారని వేరే చెప్పక్కరలేదు. బహుశః వారి తరువాత తెదేపా, వామపక్షాలు కూడా పర్యటించి తెరాస సర్కార్ పై విమర్శలు గుప్పించవచ్చు. ఇంతమంది వరుసగా తమ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నా తెరాస నేతలు జవాబు చెప్పలేని స్థితిలో ఉండటం చాలా ఆశ్చర్యకరమే. వారి మౌనం ప్రతిపక్షాల ఆరోపణలకు బలం చేకూరుస్తున్నట్లుంది కూడా. 


Related Post