రాష్ట్రపతి ఎన్నికలకు షెడ్యూల్ జారీ

June 07, 2017


img

జూలై 24వ తేదీతో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం ముగియబోతోంది. కనుక కేంద్ర ఎన్నికల కమీషన్ బుధవారం  రాష్ట్రపతి ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించింది. ఎన్నికల ప్రధాన కమీషనర్ జైదీ ఆ వివరాలను మీడియాకు తెలియజేశారు. జూన్ 14న నోటిఫికేషన్ వెలువడుతుంది. నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ జూన్ 28. నామినేషన్ల ఉపసంహరణకు జూలై 1 వరకు గడువు ఉంటుంది. జూలై 17న రాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించబడతాయి. జూలై 20వ తేదీన ఓట్ల లెక్కింపు చేసి ఫలితాలు వెల్లడిస్తారు. ఈ ఎన్నికలలో ఏ పార్టీ కూడా తమ సభ్యులకు విప్ జారీ చేయరాదని జైదీ స్పష్టం చేశారు. 

ఎన్డీఏ కూటమి తరపున మోడీ ప్రభుత్వం రాష్ట్రపతి అభ్యర్ధిగా ఎవరిని నిలబెట్టబోతోందో ఇంతవరకు ప్రకటించకుండా చాలా గుంభనంగా వ్యవహరిస్తోంది. యూపీఏ కూటమి, కాంగ్రెస్ మిత్ర పక్షాలు ఉమ్మడిగా రాష్ట్రపతి అభ్యర్ధిని నిలబెట్టాలని నిర్ణయించుకొని దీనిపై చర్చిందుకు సోనియా గాంధీ అధ్యక్షతన ఒకసారి సమావేశం అయ్యాయి కూడా. కానీ ఎన్డీఏ కూటమి తన అభ్యర్ధిని ప్రకటించక ముందే తాము ప్రకటించడం వలన తరువాత చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుందనే ఆలోచనతో అభ్యర్ధి పేరు ఖరారు చేయలేదు. ఒకవేళ ప్రతిపక్షాలకు కూడా ఆమోదయోగ్యమైన అభ్యర్ధిని మోడీ ప్రభుత్వం ప్రకటించినట్లయితే ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఎన్నికల నామినేషన్లకు గడువు ప్రకటించబడింది కనుక ఇక నేడోరేపో మోడీ ప్రభుత్వం తమ అభ్యర్ధి పేరును ప్రకటించక తప్పదు. దానిని బట్టి నిర్ణయం తీసుకోవాలని ప్రతిపక్షాలు ఎదురు చూస్తున్నాయి. 


Related Post