పాలకులు మారారు..పాలన మారలేదు: గద్దర్

June 07, 2017


img

ఇటీవల మావోయిస్టులను వీడి ప్రత్యక్ష రాజకీయాలలో ప్రవేశించిన ప్రముఖ ప్రజాకవి గద్దర్ ఈరోజు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ, “మనం ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణా సాధించుకొన్నాము. అయితే ప్రస్తుతం తెరాస సర్కార్ పాలన చూస్తుంటే పాలకులు మారారు కానీ పాలనతీరు మారలేదనిపిస్తోంది. ఇప్పుడు కనిపిస్తున్నది భౌగోళిక తెలంగాణా మాత్రమే కానీ మేము కలలు కన్నది త్యాగాల తెలంగాణా..సామాజిక సమానత్వం గల తెలంగాణా రాష్ట్రాన్ని. అది తెరాస వలన సాధ్యం కాదని తేలిపోయింది. కనుక అందరూ స్వేచ్చగా సుఖంగా జీవించగలిగే అటువంటి తెలంగాణా రాష్ట్రం కోసం మళ్ళీ మరోసారి అందరూ పోరాటం చేయకతప్పదు. అందుకు వచ్చే ఎన్నికలే ముహూర్తం,” అని అన్నారు. 

గత ప్రభుత్వాల పాలనతో పోల్చి చూస్తే ఇప్పుడు తెరాస హయాంలో తెలంగాణా రాష్ట్రంలో వేగంగానే అభివృద్ధి జరుగుతున్నట్లు కనబడుతోంది. అలాగే గతం కంటే ఇప్పుడే చాలా ఎక్కువ సంక్షేమ పధకాలు అమలవుతుండటం గమనించవచ్చు. అదేవిధంగా అట్టడుగు స్థాయి ఉద్యోగులకు బారీగా జీతాలు పెరిగాయి. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కూడా ప్రభుత్వం చాలా చురుకుగానే పనులు చేస్తున్నప్పటికీ భూసేకరణ విషయంలో అది చెడ్డపేరు మూటగట్టుకొంటోంది. కనుక మొత్తంగా చూసుకొన్నట్లయితే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు గతంలో కంటే ఎక్కువగా, వేగంగానే జరుగుతున్నట్లు స్పష్టం అవుతోంది.

కానీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, దళితులకు 3 ఎకరాల భూపంపిణీ, కేజీ టు పిగి ఉచితవిద్య మొదలైన హామీల అమలులో వైఫల్యం కూడా తెరాస సర్కార్ ను వేలెత్తి చూపే అవకాశం కల్పిస్తున్నాయి. అయితే ఎన్నికల వేడిలో ఇచ్చిన ఆ హామీలు అమలు చేయడం అసాధ్యమని ప్రజలు కూడా గ్రహించారు కనుక వచ్చే ఎన్నికలలో వారు తెరాస సర్కార్ పనితీరును మాత్రమే పరిగణనలోకి తీసుకొని ఓట్లు వేయవచ్చు. అదే జరిగితే కేసీఆర్ చెప్పిన్నట్లుగా తెరాసకు 111 సీట్లు కాకపోయినా పూర్తి మెజారిటీతో మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయమే అని చెప్పవచ్చు. కనుక గద్దర్, ప్రొఫెసర్ కోదండరామ్ వంటివారి విమర్శలను ప్రజలు పట్టించుకొంటారో లేదో అనుమానమే. 


Related Post