రాహుల్ పట్టాభిషేకం ఇంకా ఎప్పుడో?

June 06, 2017


img

కాంగ్రెస్ పార్టీ అత్యున్నత విధాన నిర్ణయాలను తీసుకొనే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మంగళవారం పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసంలో సమావేశమయ్యింది. ఆమె అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ కేంద్రమంత్రులు ఫై చిదంబరం, గులాం నబీ ఆజాద్, సీనియర్ నేతలు అంబికా సోనీ, జనార్ధన్ ద్వివేది తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో వర్తమాన రాజకీయ పరిస్థితి, కాంగ్రెస్ పరిస్థితి, రాష్ట్రపతి అభ్యర్ధి ఎంపిక మొదలైన అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

పైకి ఇతర అంశాలపై చర్చించడానికే ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పుకొంటున్నప్పటికీ దాని ముఖ్యోదేశ్యం రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అప్పజెప్పడంపై చర్చించడానికేననేది బహిరంగ రహస్యం. ఈ ఏడాది అక్టోబర్ 15లోగా పార్టీ అధ్యక్ష  పదవికి ఎన్నికలు జరుగవలసి ఉంటుంది. ప్రస్తుతం పార్టీ అధ్యక్షురాలుగా వ్యవహరిస్తున్న సోనియా గాంధీ అనారోగ్య కారణాల చేత ఇకపై ఆ భాద్యతలు నిర్వహించలేని స్థితిలో ఉన్నారు. కనుక ఇకనైనా కొడుకుకు పార్టీ పగ్గాలు అప్పజెప్పాలని భావిస్తున్నారు. అయితే ఆయన నాయకత్వంపై     పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్న కారణంగా ఆలస్యం అవుతోంది. ఈరోజు జరుగుతున్నన సమావేశంలోనైనా దీనిపై నిర్ణయం తీసుకొంటారో లేదో చూడాలి. 



Related Post