మూడేళ్ళ మోడీ పాలన: రివ్యూ

May 26, 2017


img

నేటితో ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడేళ్ళు పూర్తి చేసుకొంది. ఈ సందర్భంగా మోడీ సర్కార్ ఈ మూడేళ్ళ పాలన ఏవిధంగా సాగిందో ఒకసారి పరిశీలిస్తే, ప్రధానంగా కొన్ని విషయాలు కనబడుతాయి. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం, పెద్ద ఎత్తున సంస్కరణలు చేపట్టడం, మౌలిక వసతుల కల్పన, పరిశుభ్రతకు పెద్ద పీట వేయడం, అవినీతిరహిత పరిపాలన కనిపిస్తున్నాయి. వాటి ఫలాలు ఏవిధంగా ఉన్నాయనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నయేమో కానీ ప్రతిపక్షాలు సైతం వీటిని అయిష్టంగానైనా అంగీకరించక తప్పడం లేదు. 

మోడీ అధికారంలోకి రాగానే సంస్కరణలు మొదలుపెట్టి ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్ ను ఏర్పాటు చేసి దానిలో అన్ని రాష్ట్రాలకు సముచిత ప్రాధాన్యం ఇచ్చారు. రాష్ట్రాల నుంచి పన్ను రూపేణా కేంద్రానికి వచ్చే ఆదాయంలో రాష్ట్ర వాటాను ఏకంగా 10 శాతం పెంచి ఫెడరల్ స్ఫూర్తిని ప్రదర్శించారు. అలాగే జి.ఎస్.టి.బిల్లును ప్రవేశపెట్టి వ్యాపార లావాదేవీలలో అవకతవకలను సరిదిద్ది కేంద్రానికి రావలసిన ఆదాయం ఖచ్చితంగా వచ్చేలా చేస్తూనే, సామాన్య ప్రజలపై పన్ను భారం తగ్గించారు. 

యావత్ దేశాన్ని కుదిపివేసిన పాత పెద్ద నోట్లు రద్దు నిర్ణయం చాలా సాహసోపేతమైనదే. దానికి కొనసాగింపుగా నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తున్నారు. ఈ రెండింటి వలన తాత్కాలికంగా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ దీర్ఘకాలంలో అవి దేశ ఆర్ధిక వ్యవస్థను చాలా పటిష్టం చేయడం తధ్యం. వీటి ద్వారా దేశ ఆర్ధిక వ్యవహారాలలో అవకతవకలకు బ్రేక్స్ వేయగలిగితే ఇక భారత్ కు తిరుగు ఉండదు. అలాగే ఆర్ధిక వ్యవహారాలలో ఇదివరకు ప్రభుత్వాల మాదిరిగా మెతకగా వ్యవహరించకుండా మోడీ సర్కార్ చాలా కటినంగా వ్యవహరిస్తుండటం వలన అన్ని వర్గాలవారికీ కొంచెం నొప్పి పుడుతున్నప్పటికీ, అటువంటి ఆర్ధిక క్రమశిక్షణ దేశానికి చాలా అవసరమేనని అందరూ అంగీకరిస్తున్నారిప్పుడు.

పారిశ్రామిక అభివృద్ధి విషయంలో మోడీ సర్కార్ కొంచెం వెనుకబడిపోయినట్లు కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలే చొరవ తీసుకొని దేశవిదేశీ సంస్థలను, పరిశ్రమలను రప్పించుకొంటున్నాయి. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ రెండు తెలుగు రాష్ట్రాలే.  

ఇక దేశాభివృద్ధి విషయంలో మోడీ సర్కార్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి యుద్ధ ప్రాతిపదికన అనేక ప్రాజెక్టులు పూర్తి చేయిస్తోంది. అసోం-అరుణాచల్ ప్రదేశ్ మద్య బ్రహ్మపుత్రా నదిపై వంతెన, కాశ్మీర్ లో పొడవైన సొరంగం నిర్మాణం, చైనా సరిహద్దును ఆనుకొని ఉన్న ఈశాన్య రాష్ట్రాలలో శరవేగంగా రోడ్ల నిర్మాణం, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో పెద్ద ఎత్తున కొత్తగా జాతీయ రహదారుల నిర్మాణం, ఎయిమ్స్, ఐఐటి, ఐఐఎం వంటి ఉన్నత విద్యా వైద్య సంస్థల ఏర్పాటుకు చొరవ తీసుకోవడం, వేలాది గ్రామాలకు రోడ్లు, విద్యుత్, త్రాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలికవసతుల కల్పన కళ్ళకు కనబడుతున్న సత్యాలు. మోడీ సర్కార్ దేశంలో మౌలికవసతుల కల్పన, పరిశుబ్రతకు పెద్ద పీట వేసిందని చెప్పక తప్పదు. ఆ కారణంగానే ఈ మూడేళ్ళలో దాదాపు అన్ని రాష్ట్రాలలో కళ్ళకు కనబడేంత మార్పులు కనిపిస్తున్నాయి.

రైల్వేలలో హై స్పీడ్ రైళ్ళు, బులెట్ రైలు ప్రాజెక్టు, చిరకాలంగా పెండింగులో ఉన్న పాత రైల్వే ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తుండటం వంటివి కనబడుతున్నాయి.   

గతంతో పోలిస్తే ఇప్పుడు మన విదేశాంగ విధానాలలో కూడా చాలా స్పష్టత వచ్చింది. మోడీ సర్కార్ అవసరమైన చోట కాటిన్యం ప్రదర్శిస్తూనే, ఇరుగు పొరుగు దేశాలతో స్నేహపూరితంగా వ్యవరిస్తూ దేశానికి మంచి పేరు సంపాదించిపెట్టింది. అలాగే అమెరికా, బ్రిటన్ యూరోపియన్ దేశాలలో భారత్ పట్ల నమ్మకం, గౌరవం పెంచగలిగింది. అందుకే మన ఆర్మీ పాక్ భూభాగంలోకి ప్రవేశించి సర్జికల్ స్ట్రయిక్స్ చేసినా ప్రపంచ దేశాలు భారత్ ధైర్య సాహసాలను పొగిడాయే తప్ప వేలెత్తి చూపలేదు. చెప్పుకొంటే ఇటువంటి ఉదాహరణలు కోకొల్లలు ఉన్నాయి. 

ఈవిధంగా అన్ని రంగాలపై మోడీ ముద్ర చాలా స్పష్టంగా బలంగా కనబడుతోంది. పదేళ్ళ యూపిఏ పాలన చూసిన ప్రజలు దేశం ఏమైపోతుందో అని ఆందోళన చెందుతున్న సమయంలో హటాత్తుగా నరేంద్ర మోడీ ప్రవేశించి దేశప్రజలలో మళ్ళీ భవిష్యత్ పై ఆశలు చిగురింపజేశారు. మొత్తంగా చూసినట్లయితే ఈ మూడేళ్ళ మోడీ పాలనకు నూటికి 70 మార్కులు వేయవచ్చు. హిందుత్వ అజెండా వలన మిగిలిన 30 మార్కులు పోయాయని చెప్పక తప్పదు. 


Related Post