కాంగ్రెస్ లో ఇంత అయోమయమా?

May 26, 2017


img

తెదేపాతో పొత్తులు పెట్టుకొనే విషయంలో ఊహించినట్లే కాంగ్రెస్ నేతలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పొంగులేటి సుధాకర్ రెడ్డి తరువాత ఇప్పుడు మాజీ ఎంపి సర్వే సత్యనారాయణ కూడా తెదేపాతో పొత్తులు అనవసరం అన్నట్లు మాట్లాడారు. “ప్రస్తుతం రాష్ట్రంలో మేము బలం పుంజుకొన్నాము. వచ్చే ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసినా తెరాసను ఓడించగలమనే నమ్మకం మాకు ఉంది. మనం బలంగా ఉన్నప్పుడు వేరే పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం ఎందుకు? ఈ విషయంలో జైపాల్ రెడ్డి ఏమి మాట్లాడారో నాకు తెలియదు కానీ ఆయన తెదేపాతో పొత్తులు పెట్టుకోవాలని అని ఉండరని నేను అభిప్రాయపడుతున్నాను. అయినా పొత్తులు పెట్టుకోవాలో వద్దో మా అధిష్టానం నిర్ణయిస్తుంది. దాని ప్రకారమే ముందుకు సాగుతాము,” అని మీడియా ప్రతినిధులతో అన్నారు. 

“తెదేపా మాకు అంటరాని పార్టీ కాదు. దానితో పొత్తులు పెట్టుకోవడానికి మాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే ఇదివరకటి రాజకీయ పరిస్థితులు ఇప్పుడు లేవు,” అని జైపాల్ రెడ్డి బహిరంగంగానే చెప్పారు. ఆ విషయం మీడియాలో ప్రముఖంగా వచ్చింది కూడా. కనుక జైపాల్ రెడ్డి ఏమన్నారో నాకు తెలియదు..ఆయన ఆవిధంగా అని ఉండకపోవచ్చు..పొత్తులపై మా అధిష్టానమె నిర్ణయం తీసుకొంటుంది..”అనే మాటలన్నీ జైపాల్ రెడ్డి మాటలను ఖండిస్తున్నట్లే భావించవచ్చు. తెదేపాతో పొత్తులు పెట్టుకొనే విషయంలో పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని తెలుస్తోంది కనుక దానిపై అందరూ కూర్చొని మాట్లాడుకొన్నాక తమ నిర్ణయం చెపితే బాగుంటుంది. లేకుంటే అందరూ తలోరకంగా మాట్లాడితే వారే చివరికి నవ్వులపాలవుతారని గ్రహిస్తే మంచిది.


Related Post