ఆదాయంలో తెలంగాణా దేశంలో నెంబర్ :1

May 26, 2017


img

తెలంగాణా ఏర్పడితే దేశంలో ధనికరాష్ట్రంగా అవతరిస్తుందని కేసీఆర్ పదేపదే చెప్పేవారు. ఆయన చెప్పినట్లుగానే దేశంలో గుజరాత్ తరువాత తెలంగాణా రెండవ ధనికరాష్ట్రంగా అవతరించింది. అయితే అన్ని విధాల అభివృద్ధి చెందిన హైదరాబాద్ వంటి మహానగరం కలిగి ఉండటం, దానిలో ఏడాదికి సుమారు లక్ష కోట్లు సాఫ్ట్ వేర్ ఎగుమతులు చేసే ఐటి పరిశ్రమలు ఉండటం, ఇంకా అనేక చిన్నా పెద్ద పరిశ్రమలు, వేలకోట్లతో సినిమాలు నిర్మించే తెలుగు సినీపరిశ్రమ ఉండటం వంటివన్నీ తెలంగాణాకు కలిసివచ్చాయని చెప్పవచ్చు. ఒకప్పుడు సమైక్యరాష్ట్రంలో ఆ ఆదాయాన్ని 23 జిల్లాలు పంచుకోవలసి వచ్చేది కానీ ఇప్పుడు అది మొత్తం తెలంగాణారాష్ట్రానికే వస్తోంది కనుక సహజంగానే ధనికరాష్ట్రంగా అవతరించింది. 

అయితే తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత తెరాస సర్కార్ చేపడుతున్న అనేకానేక పాలనాపరమైన సంస్కరణలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వలన రాష్ట్రంలో ఇదివరకు ఎన్నడూ కనబడని ఒక రకమైన సానుకూల వాతావరణం ఏర్పడింది. దానితో వ్యాపార, పారిశ్రామిక అభివృద్ధి కూడా జోరందుకొంది. అది రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరిగేందుకు దోహదపడింది. 

ఇదే విషయం కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తాజా నివేదికలో పేర్కొంది. ఆ నివేదికలో 2016-17 సం.లలో తెలంగాణా రాష్ట్రం ఆదాయం 17.82 శాతం వృద్ధి రేటు సాధించినట్లు పేర్కొంది. ఇక పన్నుల రూపేణా వచ్చే ఆదాయంలో 17.81శాతం వృద్ధి రేటు సాధించినట్లు పేర్కొంది. గత ఏడాది 15శాతం వృద్ధి రేటు సాధించగా ఈసారి 17.82 శాతం వృద్ధి రేటు సాధించి దేశంలో నెంబర్ :1 నిలిచినట్లు కాగ్ నివేదికలో పేర్కొంది.

కాగ్ గురువారం ప్రకటించిన నివేదికలో వివరాలు: 

మార్చి 2016-ఫిబ్రవరి 2017 వరకు అన్ని రంగాల ద్వారా వచ్చిన ఆదాయం: రూ. 42, 564 కోట్లు

మార్చి 2015-ఫిబ్రవరి 2016 వరకు అన్ని రంగాల ద్వారా వచ్చిన ఆదాయం: రూ. 36,130 కోట్లు

ఏడాది వ్యవధిలో అన్ని రంగాల ద్వారా పెరిగిన ఆదాయం:                       రూ.6,434 కోట్లు 

సేల్స్ టాక్స్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, అబ్కారి: 17.82 శాతం వృద్ధి సాధించనట్లు కాగ్ నివేదికలో పేర్కొంది. అంటే రాష్ట్రంలోని రియల్ ఎస్టేట్ రంగం నోట్లరద్దు వంటి గడ్డు పరిస్థితులను సైతం తట్టుకొని నిలబడటమే కాకుండా నిలకడగా వృద్ధి సాధిస్తునట్లు స్పష్టం అవుతోంది.  

కాగ్ నివేదికపై ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణా ఆర్దికపరిస్థితి గురించి తన అంచనాలు నిజమయ్యాయని అధికారులతో అన్నారు. ఇకముందు కూడా ఇదే జోరు కొనసాగించేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని అధికారులను కోరారు. తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి మూడేళ్ళు కాకముందే దేశంలో నెంబర్: 1 స్థానంలో నిలవడం మనందరికీ గర్వకారణమే. 


Related Post