భాజపాలోకి దశల వారిగా వలసలుంటాయిట!

May 22, 2017


img

గత మూడేళ్ళ ఏనాడూ రాష్ట్ర భాజపా ఇతర పార్టీల నేతలను తమ పార్టీలోకి ఆకర్షించాలని ప్రయత్నించలేదు. కనీసం అటువంటి ఆలోచనలు కూడా చేయలేదు. కానీ ఇప్పుడు ఇతర పార్టీల నేతలను భాజపాలో చేర్చుకొంటామని అందరికీ వినబడేలా రాష్ట్ర భాజపా నేతలు చాలా గట్టిగా చెపుతున్నారు. మిగిలిన ఈ రెండేళ్ళలో ఇతర పార్టీల నుంచి దశలవారిగా వలసలు ఉంటాయని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్ రావు కూడా చెప్పడం విశేషం. ఈరోజు రాష్ట్రానికి వస్తున్న భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తన మూడు రోజుల పర్యటన యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఇదేనని మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మురళీధర్ రావు వంటి సీనియర్ భాజపా నేతలు చెపుతున్న మాటలు వాటిని బలపరుస్తున్నట్లున్నాయి. కనుక అమిత్ షా పర్యటిస్తున్న నల్లగొండ జిల్లాలో నుంచే మొదటి దశ వలసలు మొదలయినట్లయితే ముందుగా కోమటిరెడ్డి సోదరులతో అది ప్రారంబమవుతుందేమో?

ఒకపక్క రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకొంటూనే మరోపక్క తెరాస సర్కార్ అప్రజాస్వామిక పాలనను వ్యతిరేకిస్తున్న వారిని కూడగట్టుకొబోతున్నట్లు మురళీధర్ రావు చెప్పారు. అంటే ప్రొఫెసర్ కోదండరామ్ వంటివారిని కూడా భాజపావైపు ఆకర్షించే ప్రయత్నం చేయబోతున్నారని స్పష్టం అవుతోంది. అయితే మతతత్వపార్టీగా ముద్రపడి అతివాదధోరణి ప్రదర్శించే భాజపాతో ఆయన చేతులు కలుపడానికి ఇష్టపడతారా? అంటే అనుమానమే. 

ఏది ఏమైనప్పటికీ, తెలంగాణా రాష్ట్ర రాజకీయాలపై పట్టు సాధించాలని భాజపా ఫిక్స్ అయ్యిందని స్పష్టం అవుతోంది. అయితే అంతకంటే ముందుగా రాష్ట్రంలో తెరాస, కాంగ్రెస్ పార్టీలకు ధీటుగా ఎదిగేందుకు పార్టీని బలపరుచుకోవడం చాలా అవసరం అని గుర్తించింది కనుకనే  ఇతర పార్టీల నేతలకు పార్టీ తలుపులు బార్లా తెరిచేసింది.


Related Post