తెదేపాతో స్నేహానికైన సిద్దమట!

May 22, 2017


img

టి-పిసిసి అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి ఒక ప్రముఖ తెలుగు టీవీ ఛానల్ కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో వచ్చే ఎన్నికలలో తెదేపాతో జత కట్టబోతున్నారా? అనే ప్రశ్నకు సమాధానంగా, “వచ్చే ఎన్నికలలో తెరాస, భాజపాలను ఎదుర్కొని ఓడించేందుకు మేము ఏ పార్టీతోనయినా జత కట్టేందుకు సిద్దంగా ఉన్నాము. వాటిని ఓడించడమే మా ప్రధానలక్ష్యం కనుక అన్ని పార్టీలకు మా తలుపులు తెరిచే ఉంచుతాము. ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు అన్నీ కలిసి వివిధ సమస్యలపై ప్రభుత్వంతో పోరాడుతున్నాయి. కనుక వచ్చే ఎన్నికలలో మాతో కలిసిపని చేసేందుకు ఎవరు ముందుకు వచ్చినా వారిని మేము ఆహ్వానిస్తాము,” అని అన్నారు.  

ప్రొఫెసర్ కోదండరామ్ వెనుక మీ కాంగ్రెస్ పార్టీ ఉందని తెరాస ఆరోపిస్తోంది? వచ్చే ఎన్నికలలో ఆయన మీతో చేతులు కలుపుతారా?” అనే ప్రశ్నకు సమాధానంగా “ఆయన ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు. మేము కూడా వాటిపైనే పోరాడుతున్నందున కలుస్తున్నాము తప్ప ఆయన వెనుక మేమున్నామని చెప్పడం తప్పు. ఒకవేళ ఆయన మాతో ఏకీభవిస్తే వచ్చే ఎన్నికలలో మా పార్టీకి మద్దతు ఇస్తే తప్పకుండా స్వీకరిస్తాము,” అని చెప్పారు.

తెలంగాణాలో తెదేపా పరిస్థితే ఇప్పుడు అంతంత మాత్రంగా ఉంది. దానితో పోలిస్తే కాంగ్రెస్ పార్టీయే చాలా బలంగా కనబడుతోంది. ఇటువంటి పరిస్థితులలో చాలా బలహీనంగా ఉన్న తమ బద్ద శత్రువైన తెదేపాతో జత కట్టడానికి సిద్దం అని ఉత్తం కుమార్ రెడ్డి చెప్పడం చాలావిడ్డూరంగా ఉంది. పైగా ఆంధ్రలో అధికారంలో ఉన్న తెదేపా నేతలు నిత్యం కాంగ్రెస్ పార్టీపై..దాని నేతలపై నిత్యం తీవ్ర విమర్శలు చేస్తుంటారు. పొరుగునే ఉన్న ఆంధ్రాలో యుద్ధం చేస్తూ, తెలంగాణాలో స్నేహం చేయడం ఎలా సాధ్యమో ఉత్తం కుమార్ రెడ్డికే చెప్పాలి. తెదేపా-భాజపాలకు ఇదే ప్రశ్న వర్తిస్తుంది. 


Related Post