పాక్ పై భారత్ దాడి చేయబోతోందా?

May 20, 2017


img

భారత వాయుసేన చీఫ్ మార్షల్ బి.ఎస్. ధనోవా ఇటీవల 12,000 మంది వాయుసేన అధికారులకు లేఖలు వ్రాశారు. దానిలో ఆయన వ్రాసింది చూస్తే పాక్ పై భారత్ దాడి చేయబోతోందా లేక పాక్ చేయబోయే దాడిని ఎదుర్కోవడానికి భారత్ సిద్దం అవుతోందా? అనే అనుమానం కలుగక మానదు. 

ఆయన తన లేఖల్లో ఏమని వ్రాశారంటే, “ప్రస్తుతం మనవద్ద ఉన్న ఆయుధసంపత్తితోనే అవసరమైతే ‘ఆపరేషన్’ నిర్వహించడానికి అందరూ సిద్దంగా ఉండాలి. అది కూడా ఆదేశాలు జారీకాగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే రంగంలోకి దిగేవిదంగా అందరూ సిద్దంగా ఉండాలి. అటువంటి అత్యవసర పరిస్థితులలో తక్షణమే స్పందించడానికి అవసరమైన శిక్షణ అందరూ తీసుకోవాలి,” అని వ్రాశారు. 

ఆ లేఖలలో వాయుసేన ఉద్యోగులకు సంబందించిన ఇతర సమస్యల పరిష్కారం కోసం తాము చేస్తున్న ప్రయత్నాల గురించి కూడా అయన వివరించినట్లు సమాచారం. కానీ ఆ లేఖలలో ముఖ్యాంశంగా ఇదే కనబడుతోంది. ఇది తమ శాఖలో అంతర్గతంగా నిత్యం వచ్చే లేఖ మాత్రమేనని ఒక అధికారి చెప్పినట్లు తెలుస్తోంది.

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో వేర్పాటువాదులను, యువతను పాక్ ప్రోత్సహిస్తుండటం, వారు తమ అల్లర్లు,ఆందోళనలు కొనసాగించడానికి పాక్ ప్రభుత్వం నిధులను అందజేస్తుండటం, సరిహద్దుల వద్ద పాక్ సైనికులు తరచూ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడటం, పాక్ నుంచి నిత్యం ఉగ్రవాదులు భారత్ లోకి జొరబడే ప్రయత్నాలు చేస్తుండటం వంటివన్నీ భరించడం భారత్ కు చాలా కష్టంగానే ఉంటోంది. కానీ వాటిని నివారించేందుకు అణ్వాయుధాలు కలిగిన పాకిస్తాన్ తో యుద్ధానికి సిద్దం అవుతుందనుకోలేము. 

పాక్ ఆక్రమిత కాశ్మీర్ గుండా చైనా అంతర్జాతీయ రోడ్డు మార్గాన్ని నిర్మిస్తుండటం భారత్ కు తీవ్ర ఆగ్రహం కలిగిస్తున్నాయి. అయితే దాని కోసం పాక్ తో యుద్దానికి దిగే అవకాశాలు లేవనే చెప్పవచ్చు. 

భారత మాజీ నేవీ అధికారి కులభూషణ్ జాదవ్ కు పాక్ మిలటరీ కోర్టు ఉరిశిక్ష విదించడంపై భారత్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. అతనిని ఎట్టి పరిస్థితులలో కాపాడుకొంటామని భారత్ గట్టిగా నొక్కి చెపుతోంది. కనుక అతనిని పాక్ చెరలో నుంచి విడిపించి తీసుకువచ్చేందుకు వాయుసేన సిద్దం అవుతోందా? అనే అనుమానం కలుగుతోంది. ఎవరూ ఊహించని విధంగా పాక్ పై సర్జికల్ స్ట్రయిక్స్ చేసి చూపించిన ప్రధాని నరేంద్ర మోడీకి ఇటువంటి సాహసాలు చేయడం ఇష్టమేనని రుజువు అయ్యింది కనుక పాక్ కు బుద్ధి చెప్పేందుకు మరో సాహసానికి సిద్దం అవుతున్నారేమో? ఏమో? 


Related Post