ప్రభుత్వమే కుట్ర చేయడం దారుణం: కోదండరామ్

May 20, 2017


img

ధర్నాచౌక్ పరిరక్షణ కోసం ధర్నా చేయడానికి వచ్చినవారిపై పోలీసుల చేత దాడి చేయించడం చాలా అమానుష చర్య అని టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు.

ఆయన మహబూబ్ నగర్ లో మీడియాతో మాట్లాడుతూ, “అక్కడ ధర్నా చేయడానికి పోలీస్ కమీషనరే అనుమతించారు. కానీ మేము అక్కడికి చేరుకొన్నప్పుడు మాపై మఫ్టీలో ఉన్న పోలీసుల చేత దాడులు చేయించారు. ప్రభుత్వమే ఇటువంటి కుట్రలకు పాల్పడుతుండటం చాలా దురదృష్టకరం. మాకు పోలీసులతో, స్థానిక ప్రజలతో ఎటువంటి వివాదాలు, సమస్యలు లేవు. నిజానికి ఆరోజు స్థానిక ప్రజలే మాకు త్రాగడానికి మంచినీళ్ళు వగైరా అందించారు. అందుకు వారికీ మేము కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాము.

ధర్నాచౌక్ అక్కడే ఎందుకు ఉండాలని మేము పట్టుబడుతున్నామంటే, అది ప్రభుత్వ కార్యాలయాలకు దగ్గరలో ఉంది కనుక అక్కడ జరిగే ధర్నాలు, వాటిలో ప్రస్తావిస్తున్న సమస్యలు ప్రభుత్వం దృష్టికి వెళతాయనే ఉద్దేశ్యంతోనే తప్ప వేరే ఉద్దేశ్యంతో కాదు. కనుక ప్రభుత్వం ఇప్పటికైనా మనసు మార్చుకొని ధర్నాచౌక్ అక్కడే కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఇది ఎవరి గెలుపోటములు కావు. ప్రజల మేలు కోసం సరైన నిర్ణయం తీసుకోవడం అవసరం. ఒకవేళ ప్రభుత్వం తన నిర్ణయాన్ని వాపసు తీసుకోకపోతే ధర్నాచౌక్ ను కాపాడుకోవడానికి త్వరలోనే మేము కార్యాచరణను ప్రకటిస్తాము,” అని కోదండరామ్ అన్నారు. 

ధర్నా చౌక్ విషయంలో తెరాస సర్కార్, ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు కూడా చాలా పంతాలు, పట్టింపులకు పోతున్నాయని చెప్పక తప్పదు. తెలంగాణా కోసం ఏళ్ళ తరబడి అనేక ఉద్యమాలు చేసిన కేసీఆర్, ఇప్పుడు తన రాజ్యంలో ఎవరూ ఉద్యమాలు చేయకూడదనుకోవడం విచిత్రమే. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులను అణచివేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నా ఆయన పట్టించుకోకపోవడం విశేషం. 

ఇక ఈ సమస్యపై పోరాడుతున్న ప్రొఫెసర్ కోదండరామ్ తన పోరాటంలో రాజకీయ మైలేజీ ఆశించే ప్రతిపక్షాలను కలుపుకోవడం వలన ఇది రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న పోరాటమేననే భావన ప్రజలకు కలుగుతోంది. రాష్ట్రానికి నీటి సమస్యలను సృష్టిస్తున్న పొరుగునున్న కర్నాటక, మహరాష్ట్రాలతో కూడా చర్చించుకొని సమస్యలు పరిష్కరించుకొంటున్న తెరాస సర్కార్, ప్రొఫెసర్ కోదండరామ్ వంటి తెలంగాణా నేతలతో చర్చించి సమస్యను పరిష్కరించుకోవడానికి ఎందుకు ఇష్టపడటం లేదో అర్ధం కాదు. కనుక ప్రభుత్వం దీని కోసం కోర్టుల చుట్టూ తిరిగే బదులు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అందరితో చర్చించి ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకొంటే మంచిది. లేకుంటే అందరూ నష్టపోయే ప్రమాదం ఉంటుంది.  


Related Post