నోరు జారిన నాయిని

May 19, 2017


img

కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మొట్టమొదటిసారిగా రాష్ట్ర పోలీస్ అధికారులతో శుక్రవారం హైదరాబాద్ లో హెచ్.ఐ.సి.సి.లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన వారి పని తీరును సమీక్షించి అనేక ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడారు. ఆయన తన ప్రసంగంలో రాష్ట్ర పోలీసులపై ప్రశంశలు కురిపించారు. వారి వలన యావత్ దేశంలో తెలంగాణాకు చాలా మంచి పేరు వచ్చిందని అన్నారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం ఆద్యంతం చాలా హుందాగా, పోలీసులకు చాలా ప్రేరణ కలిగించే విధంగాసాగింది. కానీ ఆ తరువాత మాట్లాడిన రాష్ట్ర హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి ప్రసంగం అందుకు పూర్తి భిన్నంగా సాగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణా పోలీసులు అద్భుతమైన ప్రతిభాపాటవాలు కలిగి ఉన్నారని మెచ్చుకొంటే, హోం మంత్రి నాయిని సిసి కెమెరాల ఉపయోగం గురించి వివరిస్తూ, ఒక్క సిసి కెమెరా 10 మంది పోలీసులకు సమానంగా పనిచేస్తోందని వాటి వలన రాష్ట్రంలో నేరాలు చాలా తగ్గాయని అన్నారు. 

తెలంగాణా పోలీసులు ప్రజలతో చాలా స్నేహంగా వ్యవహరిస్తూ వారిలో పోలీసులంటే భయం పోగొట్టి వారు కూడా తమ ఆత్మీయులు శ్రేయోభిలాషులేననే భావన కలిగించగలిగారని ముఖ్యమంత్రి కేసీఆర్ మెచ్చుకొన్నారు. నాయిని మాట్లాడుతూ “మేము అధికారంలోకి వచ్చిన తరువాత పోలీసులకు చాలా సదుపాయాలు కల్పించాము. మంచి వాహనాలు ఇచ్చాము. ఎక్కడైనా నేరం జరిగితే పోలీసులు మోటార్ సైకిల్ మీద వెళితే వాళ్ళని ఎవరు పట్టించుకొంటారు? దర్జాగా కారులో దిగితే పోలీసులంటే అందరికీ భయం ఏర్పడుతుంది. దాని వలన నేరాలు తగ్గుతాయి,” అని అన్నారు. 

ఈ సమావేశానికి సబ్-ఇన్స్పెక్టర్ స్థాయి నుంచి రాష్ట్ర డిజిపి వరకు 1,500 మంది హాజరయ్యారు. వారిలో మహిళా పోలీస్ అధికారులు చాలా మందే ఉన్నారు. అంతమంది సమక్షంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ గురించి మరింత వివరించే ప్రయత్నంలో నాయిని నోరు జారారు. “ఇదివరకు ప్రజలు పోలీస్ స్టేషన్లకు వెళ్ళాలంటే భయపడేవారు. పోలీసులు కూడా ఎవరైనా వస్తే ‘ఏరా..మాకి... ...” అంటూ సంభోదించేవారు. కానీ ఇప్పుడు ఆ తీరు మారింది,” అని అన్నారు. నాయిని నోట ఆ బూతు పదాలు విని పోలీస్ అధికారులు షాక్ అయ్యుంటారు. ఒక ఉన్నత స్థాయి సమావేశంలో సాక్షాత్ హోం మంత్రి ఈవిధంగా మాట్లాడటం విస్మయం కలిగిస్తుంది.

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగిస్తుంటే అధికారులు చప్పట్లు చరుస్తూ తమ ఆనందాన్ని, కృతజ్ఞతని పదేపదే వ్యక్తం చేశారు. కానీ హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి తన ప్రసంగంతో వారి గాలి తీసేయడమే కాకుండా తన ఎదుట మహిళా పోలీస్ అధికారులున్నారనే సంగతి కూడా పట్టించుకోకుండా బూతులు మాట్లాడటం విస్మయం కలిగిస్తుంది.   


Related Post