దేవుడు ఇంక ఎన్నటికీ ఆయనను శాశించడేమో..

May 19, 2017


img

బాషా సినిమాలో “నేను ఒక్కసారి చెపితే వందసార్లు చెప్పినట్లే” అని రజనీకాంత్ పలికిన డైలాగ్ ఎంత హిట్ అయ్యిందో అందరికీ తెలుసు. అలాగే తన రాజకీయ ప్రవేశంపై ఎవరైనా ప్రశ్నించినప్పుడు “ పైనున్న ఆ దేవుడు శాశిస్తే నేను తప్పకుండా రాజకీయాలలోకి వస్తాను,” అనే మరో డైలాగ్ చెపుతుంటారు. మొదట్లో ఈ డైలాగ్ కూడా బాగానే పేలింది కానీ ఆయన మళ్ళీ మళ్ళీ అదే డైలాగ్ చెపుతుండటంతో “ఆయన వందసార్లు చెపితే ఒకసారి చెప్పినట్లు” అని మరో కొత్త డైలాగ్ సోషల్ మీడియాలో పుట్టింది. 

రజనీకాంత్ తన అభిమానుల ఒత్తిడి మేరకు ఈనెల 15 నుంచి 19వరకు అంటే ఈరోజు వరకు చెన్నైలోని తన అభిమానులతో వరుసగా సమావేశం అవుతూ వారితో ఫోటోలు దిగుతున్నారు. ఆయన రాజకీయ ప్రవేశం కోసం చిరకాలంగా ఎదురుచూస్తున్నవారు, చివరి రోజైన ఈరోజు ఆయన తప్పకుండా దానిపై నిర్దిష్టమైన ప్రకటన చేస్తారని చాలా ఆశలు పెట్టుకొన్నారు. కానీ యధాప్రకారం ‘పైనున్న ఆ దేవుడు శాశిస్తే..’ డైలాగ్ పలికిన తరువాత వర్తమాన రాజకీయ పరిస్థితులపై తన అభిప్రాయం వ్యక్తం చేసి సమావేశం ముగించారు. 

ఈరోజు అభిమానులతో జరిగిన సమావేశంలో వారిని ఉద్దేశ్యించి ఆయన ఏమన్నారంటే, “ఇప్పుడు నా వయసు 67సం.లు. నేను కర్నాటకలో పుట్టి అక్కడే 23సం.లు పెరిగాను. కానీ ఆ తరువాత తమిళనాడుకు వచ్చేసాను. అప్పటి నుంచి గత 43 ఏళ్ళుగా ఇక్కడే ఉంటున్నాను. మళ్ళీ జన్మంటూ ఉంటె నేను తమిళనాడులోనే పుట్టాలని కోరుకొంటున్నాను. మీ అభిమానం, ప్రేమాధారణలతోనే నేను ఈ స్థాయికి చేరుకొన్నాను. అందుకు మీకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. 

ప్రస్తుతం మన రాజకీయ పరిస్థితులు ఏమాత్రం బాగోలేవు. అవి నానాటికీ ఇంకా దిగజారుతూనే ఉన్నాయి. రాజకీయాలలో ఉన్నపుడు అనుకూలత, వ్యతిరేకత రెండూ ఉంటాయి. అది సహజం. ప్రతిపక్షాలు, వ్యతిరేకత లేకుండా ఎక్కడా రాజకీయాలు ఉండవు. కనుక వాటిని అంగీకరించి ముందుకు సాగుతుండాలి,” అని అన్నారు. 

రజనీకాంత్ అభిమానులు నిరాశ చెందేఉంటారు. అయితే ఆయన తన వయసు గురించి మొట్టమొదట చెప్పిన మాటను ఎవరూ మరిచిపోకూడదు. ‘ఇది రాజకీయాలలోకి ప్రవేశించే వయసు కాదు నిష్క్రమించవలసిన వయసు’ అని ఆయన చెప్పినట్లు భావించవచ్చు. అది నిజం కూడా. కనుక అభిమానులు ఆయనపై ఇంకా ఒత్తిడి చేయకపోవడమే మంచిది.


Related Post