మొన్న రౌడీలు..నిన్న రైతులా? రేవంత్ రెడ్డి

May 12, 2017


img

ఖమ్మం మిర్చి యార్డు దాడి ఘటనకు పాల్పడిణ వారందరూ రౌడీలే..ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలే అని ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా మంత్రులు, తెరాస నేతలు ముక్తకంఠంతో వాదించారు. తరువాత వారిపై కేసులు పెట్టించి జైలుకు కూడా పంపారు. పోలీసులు వారి చేతులకు బేడీలు వేసి నిన్న ఖమ్మం కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు, ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, న్యాయవాదులు అందరూ తీవ్రంగా నిరసించారు. ఈ సంగతి తెలియగానే వారికి బేడీలు వేసినందుకు ఇద్దరు పోలీస్ అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఒకవేళ వారు నిజంగా రౌడీలే అని ప్రభుత్వం భావించి ఉండి ఉంటే, వారికి బేడీలు వేయడాన్ని సమర్ధించుకొని ఉండేది. పోలీసులను సస్పెండ్ చేసి ఉండేది కాదు. కనుక ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చెప్పినట్లుగా వారు రౌడీలు, గూండాలు కాదు..నిజమైన రైతులేనని ప్రభుత్వానికి కూడా తెలుసునని స్పష్టం అయ్యింది. 

ఖమ్మం మిర్చి యార్డు దాడి గురించి మంత్రులు, తెరాస నేతలు ఆవిధంగా మాట్లాడటం వలననే క్రింద స్థాయి అధికారులు, పోలీసులు కూడా వారికి భయపడి రైతులను దోషులుగా చిత్రీకరించి కేసులు పెట్టి జైలుకు పంపించారని రేవంత్ రెడ్డి విమర్శించారు.  ఇప్పుడు తమ తప్పులకు  ఇద్దరు పోలీస్ అధికారులను సస్పెండ్ చేసి అందరూ చేతులు దులుపుకొన్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు.  

తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇదే విషయాన్ని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి తుమ్మల నాగేశ్వర రావు  దీనికి ఏమని సమాధానం చెపుతారని ప్రశ్నించారు. మంత్రులు తుమ్మల, హరీష్ రావు ఇద్దరూ కలిసి ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ని తప్పు ద్రోవ పట్టించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కనుక కేసీఆర్ డిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకోగానే వారిపై విచారణ జరిపేందుకు ఒక కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. 


Related Post