నాగలి పట్టే రైతన్న చేతికి బేడీలు!

May 12, 2017


img

అందరికీ అన్నం పెట్టే అన్నదాత రైతన్న. అందుకోసం అతను రేయనక పగలనక కష్టపడి పనిచేస్తాడు. అప్పులు చేసి పంటలు పండిస్తాడు. కానీ విత్తనం వేసినప్పటి నుంచి పండిన పంటను అమ్ముకొనేవరకు అడుగడుగునా దోపిడీకి గురవుతుంటాడు. ఏ దశలోనూ ఏదీ అతని నియంత్రణలో ఉండదు. అంతా దైవాదీనమే.

మిర్చి రైతుల కష్టాలు చూస్తే ఆ సంగతి అర్ధం అవుతుంది. మిర్చి ధరను క్వింటాలుకు రూ.3,000 గా నిర్ణయించి వ్యాపారులు తమను దోచుకొంటుంటే, మార్కెట్ యార్డ్ అధికారులు కూడా తమకు అండగా నిలబడకపోవడంతో మిర్చి రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకొని ఏప్రిల్ 28న కొందరు మిర్చి రైతులు ఖమ్మం మార్కెట్ యార్డ్ కార్యాలయంపై దాడి చేశారు. 

వారి ఆవేదనను, ఆక్రందనలను అర్ధం చేసుకొని మానవతా దృక్పధంతో స్పందించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం వారందరూ అసాంఘిక శక్తులని అది ప్రతిపక్ష పార్టీల కుట్ర అని వాదించి రైతుల మనసులను చాలా నొప్పించింది. అంతటితో ఆగకుండా ఆ 10 మందిపై కేసులు పెట్టి జైలుకు పంపించింది. రైతులను జైలుకు పంపించినందుకు తమపై రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారనే సంగతి తెరాస సర్కార్ కు తెలియదనుకోలేము.

ఈ అవమానాలు సరిపోవన్నట్లు వారు దొంగలో లేదా కరడుగట్టిన ఉగ్రవాదులో అన్నట్లుగా పోలీసులు వారి చేతులకు సంకెళ్ళు వేసి జైలు నుంచి ఖమ్మం కోర్టుకు తీసుకువచ్చారు. నాగలి పట్టే తమ చేతులకు సంకెళ్ళు వేసి నడిరోడ్డు మీద నడిపిస్తూ కోర్టుకు తీసుకువచ్చినందుకు పాపం ఆ రైతులు ఎంత బాధ, అవమానపడ్డారో ఎవరూ ఊహించలేరు.

ఈ సంఘటనపై ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు ఖమ్మంలో నిన్న ఆందోళనలు చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టి బొమ్మలను తగులబెట్టి తమ నిరసనలు తెలియజేశాయి. ప్రతిపక్షాలు ఆందోళన చేయడంతో అందుకు బాధ్యులైన ఇద్దరు పోలీస్ అధికారులను సస్పెండ్ చేస్తున్నట్లు నగర కమీషనర్ తఫ్సీర్ ఇక్బాల్ ప్రకటించారు. రైతుల చేతులకు బేడీలు వేసిన సంగతి తెలిసిన వెంటనే తమ ప్రభుత్వం వెంటనే స్పందించి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకొందని తెరాస నేతలు తమ ప్రభుత్వాన్ని సమర్ధించుకొన్నారు. ఈ సంఘటనపై మానవ హక్కుల సంఘానికి పిర్యాదు చేస్తామని ఖమ్మం న్యాయవాదుల జెఏసి ప్రతినిధులు చెప్పారు. ఖమ్మం కోర్టు 10 మంది రైతులకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 

మిర్చి రైతుల విషయంలో ప్రభుత్వం తన తప్పును లేదా బలహీనతను కప్పిపుచ్చుకొనే ప్రయత్నంలో రైతులపై ద్రోహులని అభివర్ణించడం, వారిపై కేసులు పెట్టి జైలుకు పంపినపుడే రైతులలో ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను ఏర్పరచుకొంది. ఇప్పుడు పోలీసులు ప్రదర్శించిన అత్యుత్సాహం కారణంగా రైతుల దృష్టిలో తెరాస సర్కార్ ఇంకా పలుచన అయ్యిందని చెప్పక తప్పదు.


Related Post