సోనియా కోలుకొంటున్నారు సరే..మరి రాహుల్?

May 11, 2017


img

 ఇటీవల కొద్దిగా అస్వస్థతకు గురైన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ డిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకొని మెల్లగా కోలుకొంటున్నారు. ఒకటి రెండురోజులలో ఆమె ఇంటికి వెళ్లిపోవచ్చని వైద్యులు చెపుతున్నారు. 69 ఏళ్ళు వయసున్న సోనియా గాంధీ గత ఒకటి రెండేళ్ళుగా తరచూ అనారోగ్యం పాలవుతున్నారు. ఆమె అనారోగ్య కారణంగానే పార్టీకి చాలా కీలకమైన 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొనలేదు. ఆమె పాల్గొని ఉంటే ఫలితాలు ఏవిధంగా ఉండేవో కానీ ఒక్క పంజాబ్ లో తప్ప మిగిలిన నాలుగు రాష్ట్రాలను కాంగ్రెస్ పార్టీ చేజార్చుకొంది. ఆ తరువాత డిల్లీ మున్సిపల్ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ ఓడిపోవడంతో రాహుల్ గాంధీ నాయకత్వ లక్షణాలపై కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ చర్చ మొదలైంది.

ఈ కారణంగానే రాహుల్ గాంధీ తల్లి తరచూ అనారోగ్యం పాలవుతున్నప్పటికీ పార్టీ పగ్గాలు చేపట్టలేకపోతున్నారు. సోనియా గాంధీ కోలుకొని మళ్ళీ ఇంటికి తిరిగి వస్తారు కానీ రాహుల్ గాంధీ ఇంకా పార్టీ పగ్గాలు ఎప్పుడు చేపడుతారో... అసలు చేపట్టే అవకాశం ఉందో లేదో..తెలియని పరిస్థితి నెలకొని ఉంది.

ఈసారి దేశంమంతటా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని మోడీ ప్రభుత్వం భావిస్తోంది. అది సాధ్యమో కాదో తెలియదు కానీ వాటి కోసం దేశంలో చిన్నా, పెద్ద పార్టీలన్నీ అప్పుడే సన్నాహాలు ప్రారంభించేశాయి. తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల సన్నాహాలు ప్రారంభించేసిన సంగతి అందరికీ తెలుసు. ఒకవేళ ఒకేసారి ఎన్నికలు నిర్వహించదలిస్తే, ఆరు నెలలు ముందుగానే నిర్వహించవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అంటే నేటికి సరిగ్గా ఏడాదిన్నర సమయం మాత్రమే ఉందనుకోవచ్చు.

దేశంలో అన్ని పార్టీలు ముందస్తు ఎన్నికలకు సిద్దం అవుతున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఇంకా అయోమయ స్థితిలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ముందుగా నాయకత్వ సమస్యను పరిష్కరించుకొంటే గానీ ఎన్నికల గురించి ఆలోచించలేదు. కానీ రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టడానికి ఎప్పుడు ప్రయత్నం చేసినా పార్టీలో చిచ్చు రగులుకొంటోంది. ఆ ప్రస్తావన చేయడం అంటే తేనె తుట్టెను కదిపినట్లే అవుతుండటంతో, పార్టీలో ఎవరూ దాని గురించి మాట్లాడటానికి ఇష్టపడటం లేదు. సోనియా గాంధీ తరచూ అనారోగ్యంతో పార్టీ వ్యవహారాలు చూసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ఇంకా తాత్సారం చేస్తే రాహుల్ గాంధీ భవిష్యత్ మాత్రమే కాకుండా పార్టీ భవిష్యత్ పై కూడాతీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది.


Related Post