జస్టిస్ కర్ణన్ చెన్నైని ఎందుకు ఎంచుకొన్నట్లు?

May 11, 2017


img

నిన్న మొన్నటి వరకు రోజూ మీడియా ముందుకు వచ్చి సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై తీవ్ర విమర్శలు గుప్పించిన కోల్ కత హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి.ఎస్.కర్ణన్ హటాత్తుగా కనబడకుండాపోయారు. కోర్టుధిక్కార నేరానికి పాల్పడినందుకు సుప్రీంకోర్టు ఆయనకు 6 నెలలు జైలు శిక్ష విదించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. సుప్రీంకోర్టు ఆయనకు జైలు శిక్ష విదిస్తూ తీర్పు చెపుతున్నప్పుడు ఆయన చెన్నైలో ఉన్నారు. తీర్పు వెలువడగానే ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయనను అరెస్ట్ చేసేందుకు పశ్చిమ బెంగాల్ పోలీసులు బుదవారం చెన్నై చేరుకొన్నారు. స్థానిక పోలీసుల సహకారంతో ఆయన ఆచూకీని కనిపెట్టాలని ప్రయత్నిస్తున్నారు. 

ఒక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి పరిస్థితి ఇంతవరకు తెచ్చుకోవడం ఒక వింత అనుకొంటే, అందరికీ ఆదర్శంగా నిలబడవలసిన ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం ఇంకా విచిత్రం. ఆయనకు శిక్ష పడుతుందని అనుమానం కలుగగానే, పశ్చిమ బెంగాల్ నుంచి తమిళనాడుకు వచ్చేయడం కూడా యాదృచ్చికంగా భావించలేము. దళితుడనైన తనపై సుప్రీంకోర్టు వివక్ష చూపిస్తోందని ఆరోపిస్తున్న జస్టిస్ కర్ణన్ ఇప్పుడు చెన్నైలో తలదాచుకొని దక్షిణాది వాడినైన తనను ఉత్తరాదివారు వెంటాడి వేధిస్తున్నారనే భావన ప్రజలకు, రాజకీయ పార్టీలకు కలిగించే ప్రయత్నం చేస్తున్నట్లున్నారు. లేదా ఉత్తరాది ఆధిపత్యాన్ని తీవ్రంగా వ్యతిరేకించే తమిళనాడు రాజకీయ పార్టీల మద్దతు ఆశించి ఆయన అక్కడికి చేరుకొని ఉండవచ్చు. ఇటువంటి సమస్యలపై తమిళనాడులోని రాజకీయ పార్టీలు చాలా తీవ్రంగా స్పందిస్తుంటాయని అందరికీ తెలుసు. అదే కనుక జరిగితే ఇది మరొక పెద్ద సమస్యకు దారి తీసే ప్రమాదం ఉంటుంది. 


Related Post