రైతుల సమస్యలపై ప్రశ్నించడం కుట్రా?

May 11, 2017


img

మిర్చి రైతులకు మద్దతుగా తెదేపా ఈ నెల 12,13 తేదీలలో ఖమ్మంలో ధర్నా చేస్తామని ప్రకటించింది. రాష్ట్ర ఎస్సీ కార్పోరేష్ చైర్మన్ పిడమర్తి రవి నిన్న తెలంగాణా భవన్ లో మీడియాతో మాట్లాడుతూ, “రైతులపై తెదేపా, భాజపా నేతలకు నిజంగా అంత ప్రేమ ఉన్నట్లయితే వారు ఇక్కడ ధర్నాలు చేసే బదులు డిల్లీ వెళ్ళి ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి ముందు ధర్నాలు చేస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుంది. వాణిజ్య పంటలకు మద్దతు ధర నిర్ణయించే బాధ్యత కేంద్రప్రభుత్వానిదే తప్ప రాష్ట్ర ప్రభుత్వానిది కాదని వారికీ తెలుసు. కానీ వారు మిర్చి రైతుల సమస్యను అడ్డం పెట్టుకొని మా ప్రభుత్వంపై రాజకీయ కుట్రలు చేస్తున్నారు. కేంద్రం చేయాల్సిన పనిని రాష్ట్రం ఏవిధంగా చేయగలదు? తెదేపా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆ రోజు ఖమ్మం మార్కెట్ యార్డుపై దాడికి కుట్ర చేయడమే అందుకు ఉదాహరణ. ఆయన చంద్రబాబు నాయుడు దృష్టిలో పడాలనే తపనతో ఈవిధంగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్, తెదేపా, భాజపా మూడు పార్టీలు కలిసి ఒక పద్ధతి ప్రకారం రైతులలో అపోహలు సృష్టిస్తూ వారిని మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి,” అని ఆరోపించారు.  

రవి చెపుతున్నట్లు వాణిజ్య పంటలకు మద్దతు ధర ప్రకటించవలసిన బాధ్యత కేంద్రానిదే. కనుక మిర్చి రైతుల సమస్యతో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదన్నట్లు మాట్లాడటం చాలా తప్పు.  రైతులను ఆదుకోవలసిన బాధ్యత కేంద్రప్రభుత్వానికి ఎంత ఉందో రాష్ట్ర ప్రభుత్వానికి అంతకంటే ఎక్కువే ఉంటుంది. ఎందుకంటే, ఆ రైతులందరూ వేసే ఓట్లతోనే తెరాస అధికారంలోకి రాగలిగింది. వచ్చే ఎన్నికలలో కూడా ఆ రైతుల ఓట్లను సంపాదించుకొని మళ్ళీ అధికారంలోకి రావాలని కలలు కంటోంది. తమది రైతు ప్రభుత్వమని, రాష్ట్రంలో రైతులు అందరూ తమవైపే ఉన్నారని వరంగల్ సభ సాక్షిగా ప్రకటించుకొంది. మరి అటువంటప్పుడు వారిని ఆదుకోవలసిన బాధ్యత కూడా ఉంటుంది కదా?రైతుల ఓట్లు మాత్రమే కావాలి వారి సమస్యలతో మాకు సంబంధం లేదంటే రైతులు కూడా తెరాసతో అదే విధంగా వ్యవహరించలేరా? వారిని ఆదుకోవడానికి తెరాస సర్కార్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేదా ప్రయత్నాలు ఏమైనా చేస్తోందో లేదో తెలియదు కానీ మిర్చి రైతుల సమస్యలపై తమను నిలదీస్తున్న ప్రతిపక్షాలపై ఈవిధంగా మండిపడుతోంది. రైతుల సమస్యలపై ప్రశ్నిస్తే అది తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న కుట్రే అనే మరో కొత్త సిద్దాంతం వల్లిస్తోంది. తెరాస నేతలు తమ వాగ్ధాటితో ప్రతిపక్షాలకు ఈవిధంగా చాలా ఘాటుగా, ధీటుగా జవాబు చెప్పగలరేమో కానీ వాటితో రైతుల సమస్యలు, కష్టాలు తీరవు. వారి సమస్యలను తీర్చలేకపోతే వారి ఆగ్రహానికి గురికాక తప్పదని గ్రహిస్తే మంచిది.   


Related Post