రాహుల్ వస్తారు..వెళ్తారు..ఏమి ప్రయోజనం?

May 11, 2017


img

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ జూన్ 1న రాష్ట్రానికి రాబోతున్నట్లు తాజా సమాచారం. ఆయన పర్యటన ఖరారు అయితే ఆ రోజు సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఒక బహిరంగ సభ నిర్వహించాలని భావిస్తోంది. వీలైతే ఆ మరునాడు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాహుల్ గాంధీను ఉస్మానియా యూనివర్సిటీకి కూడా తీసుకువెళ్ళి అక్కడ విద్యార్ధులతో మాట్లాడించాలని టి-కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. త్వరలోనే రాహుల్ గాంధీ పర్యటన ఖరారు కావచ్చు.

అయితే ఎప్పుడూ డిల్లీకి లేదా ఉత్తరాది రాష్ట్రాలకే పరిమితం అయ్యే రాహుల్ గాంధీ కనీసం అక్కడ కూడా తన ప్రభావం చూపలేక చతికిలపడుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. ఇటీవల జరిగిన యుపి, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా శాసనసభ ఎన్నికలలో ఒక్క పంజాబ్ లో తప్ప అన్ని రాష్ట్రాలను కాంగ్రెస్ పార్టీ చేజార్చుకొంది. ఆ తరువాత జరిగిన డిల్లీ మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 3వ స్థానంతో సరిపెట్టుకోవలసి వచ్చింది. కనీసం తను ఉంటున్న డిల్లీలో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోలేకపోతున్న రాహుల్ గాంధీ, రెండేళ్ళకు ఓసారి తెలంగాణా వచ్చి హడావుడిగా పాదయాత్రలు చేసి దారిలో చిన్న పిల్లలను ఎత్తుకొని ఫోటోలకు ఫోజులు ఇవ్వడం వలన రాష్ట్ర కాంగ్రెస్ఏ పార్టీకి ఏమైనా రాజకీయ ప్రయోజనం కలిగిందా? ఆయన మొక్కుబడిగా బహిరంగ సభలో పాల్గొంటే తెలంగాణా ప్రజలపై ఏమైనా ప్రభావం చూపగలిగారా? అని టి-కాంగ్రెస్ నేతలే ఆలోచించుకోవాలి. వాస్తవానికి రాహుల్ గాంధీ పర్యటనల వలన కంటే ప్రజా సమస్యలపై టీ-కాంగ్రెస్ నేతలు చేస్తున్న పోరాటాలు, వాటి కోసం వారు నిర్వహించుకొంటున్న బహిరంగ సభల వలననే  వారు ప్రజలకు చేరువ కాగలుగుతున్నారు. తద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ప్రయోజనం కలుగుతోంది. కనుక రాహుల్ గాంధీ లేదా మరొక జాతీయ కాంగ్రెస్ నేతనో  నమ్ముకోవడం కంటే టీ-కాంగ్రెస్ నేతలు తమ స్వశక్తినే నమ్ముకోవడమే మంచిది.    



Related Post