బాబా నీకిది తగునా?

May 06, 2017


img

సాధువులు, బాబాలు, పీఠాదిపతులు, ఇతర మత గురువులు ఇహలోక సమస్యలకు, రాగద్వేషాలకు అతీతులుగా ఉండాలి. ఉంటారని ఆశించడం అత్యాశ కాదు. వారు కేవలం ఆధ్యాత్మిక విషయాలకే పరిమితం అయ్యి ప్రజలను ధర్మమార్గంలో నడిపించాలని ఆశించడం అత్యాశ కాబోదు. కానీ నేటి రోజుల్లో వారు సినీ కళాకారులతో, రాజకీయ నేతలతో, బడా పారిశ్రామికవేత్తలతో భుజాలు రాసుకొని తిరుగుతూ, సినిమాలు, రాజకీయాలు, యుద్దాల గురించి కూడా మాట్లాడుతున్నారు. కొందరు మతగురువులు ఏదో ఒక రాజకీయ పార్టీకి వత్తాసుగా మాట్లాడుతున్నారు. బాబా రాందేవ్ మరొకడుగు ముందుకు వేసి వ్యాపార సంస్థలను స్థాపించి విజయవంతంగా నడిపిస్తున్నారు కూడా. ఇవన్నీ సామాన్య ప్రజలు ఊహించని పరిణామమే కానీ జీర్ణించుకోక తప్పడం లేదు.  

ఇటీవల పాక్ సైనికులు భారత్ భూభాగంలోకి జొరబడి ఇద్దరు భారత జవాన్లను చంపి, ఆ తరువాత వారి శరీరాలను ముక్కలు ముక్కలుగా నరికి, వారిరువురి తలలను నరికి మళ్ళీ పాక్ లోకి పారిపోయారు. ఆ సంఘటనపై బాబా రాందేవ్ మాట్లాడుతూ, “పాకిస్తాన్ సైనికులు మన ఒక్క సైనికుడి తల నరికితే, మనం పాక్ సైనికుల 100 తలలు నరకాలి. పాక్ పై ప్రతీకారం తీర్చుకోవలసిందే. దానికి సంకోచించనవసరం లేదు. ఇజ్రాయెల్ తరహాలోనే భారత్ కూడా పాక్ పై దూకుడుగా వ్యవహరించాలి,” అని అన్నారు. 

సాధువులు, బాబాలు కూడా తమ నోటిని, ఆగ్రహావేశాలను అదుపు చేసుకోలేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటి? రాందేవ్ బాబా చెప్పినట్లు ఒకవేళ పాక్ పై భారత్ దండయాత్రకు బయలుదేరితే ఏమవుతుంది? గత పరాభవాలకు ప్రతీకారం తీర్చుకోవాలనే తపనతో పాకిస్తాన్ అనేక అణ్వాయుధాలను తయారు చేసుకొని, వాటిని భారత్ పై ప్రయోగించేందుకు తగిన సమయం కోసం ఎదురు చూస్తోంది. ఒకసారి భారత్-పాక్ మద్య యుద్ధం మొదలైతే వాటిపై పాక్ ప్రభుత్వం నియంత్రణ కోల్పోయి అవి పాక్ లో తిష్ట వేసుకొన్న ఉగ్రవాదుల చేతులలో పడటం ఖాయం. అదే జరిగితే అప్పుడు భారత సైనికులు లక్షమంది పాక్ సైనికుల తలలు నరికి తెచ్చినా వాటిని చూసి సంతోషించేందుకు ఎవరూ మిగిలి ఉండరు. 

అందుకే భారత్ ఎప్పుడూ సంయమనం కోల్పోకుండా ప్రపంచదేశాలలో పాకిస్తాన్ ను ఒంటరి చేసి వాటితోనే దానికి గట్టిగా బుద్ధి చెప్పిస్తోంది. కనుక భారత్-పాక్ సరిహద్దుల వద్ద ఇటువంటి విషాదకర సంఘటనలు పునరావృతం కాకుండా భారత్ తగిన జాగ్రత్తలు తీసుకోవడమే ఏకైక మార్గం. బాబాలు, సాధువులు భారత ప్రభుత్వం ఏమి చేయాలో చెప్పే బదులు, దేశానికి, సైనికులకు తాము ఏమి చేయగలమని ఆలోచించడం మంచిది.   



Related Post