కేసీఆర్ బాటలో టి-కాంగ్రెస్

May 06, 2017


img

రాష్ట్రంలో ముస్లింలకు, గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ బీసి-ఈ బిల్లును శాసనసభ, మండలి చేత ఆమోదించుకొన్నప్పుడు అన్ని పార్టీలతో సహా కాంగ్రెస్ పార్టీ కూడా గట్టిగానే విమర్శించింది. అయితే దానికి కూడా ఒక స్థిరమైన ముస్లిం ఓటు బ్యాంక్ ఉంది కనుక ఆ బిల్లులో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడంపై తన వైఖరి ఏమిటో ఇంతవరకు బయటపెట్టలేదు. దానిపై అది ‘కర్ర విరగకూడదు..పాము చావకూడదు’ అన్నట్లుగా మాట్లాడుతోంది. కానీ ఆ రిజర్వేషన్ల బిల్లుతో తెరాసకు రాజకీయ మైలేజి వచ్చే అవకాశం ఉందనే సంగతి టి-కాంగ్రెస్ నేతలకు కూడా గ్రహించారు. బహుశః అందుకే వారు కూడా కేసీఆర్ బాట పట్టినట్లున్నారు. వచ్చే ఎన్నికలలో తమ పార్టీ గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి వస్తే రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన బీసిలకు రిజర్వేషన్లు కల్పిస్తామని టి-పిసిసి అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి చెప్పారు. కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే దేశంలో బీసిలకు న్యాయం చేస్తుందని అన్నారు. 

హైదరాబాద్, గాంధీ భవన్ లో శుక్రవారం టీ-కాంగ్రెస్ నేతల సమావేశం జరిగింది. దానికి డిల్లీ నుంచి ఏ.ఐ.సి.సి. కార్యదర్శి, రాష్ట్ర పరిశీలకుడు ఆర్‌.సి.కుంతియా హాజరయ్యారు. ఆ సందర్భంగా మాజీ ఎంపి మధు యాష్కి మాట్లాడుతూ, “ముఖ్యమంత్రి కేసీఆర్ దొరల అహంకారం బాగా ప్రదర్శిస్తున్నారు. ‘ఎవరేమనుకుంటే నాకేమిటి?’ అనే రీతిలో చాలా నిరంకుశంగా, అహంకారపూరితంగా పాలిస్తున్నారు. ఆయన ఒక వర్గానికి చెందిన నేతలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు. మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తప్ప రాష్ట్రంలో ప్రజాస్వామ్య వాతావరణం ఏర్పడదు. వచ్చే ఎన్నికలలో తెరాసకు, కేసీఆర్ కు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం. కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం కూడా ఖాయం,” అని అన్నారు.

ప్రస్తుతం కేసీఆర్ బీసిలకు, ఎస్సీలకు వారి వారి జనాభా ప్రాతిపదికనే రిజర్వేషన్లు కల్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వీలైతే వారికి మరికాస్త ఎక్కువే ఈయలని ఆలోచిస్తున్నారు. కనుక టీ-కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న ఈ హామీలో  కొత్తదనం ఏమీ లేదనే చెప్పవచ్చు. దశాబ్దాల పాటు సాగిన కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో ఒకటి రెండు వర్గాల నేతలు మాత్రమే అధికారం అనుభవించిన సంగతి మరిచిన టీ-కాంగ్రెస్ నేతలు, కేసీఆర్ ఒక వర్గం నేతలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించడం చాలా హాస్యాస్పదంగా ఉంది.


Related Post