మిర్చి రైతులను ఎవరు మోసం చేస్తున్నారు?

May 05, 2017


img

కేంద్రప్రభుత్వం మిర్చికి రూ.5,000 మద్దతు ధర ప్రకటించడంతో తెరాస, భాజపాల మద్య మాటల యుద్ధం మొదలైంది. మిర్చి రైతుల సమస్యలు, మిర్చి ధరలు, నాణ్యత, ఉత్పత్తి మొదలైన విషయాలపై కేంద్రప్రభుత్వానికి స్పష్టత లేనట్లు వ్యవహరించిందని మంత్రి హరీష్ రావు విమర్శించారు. 

దానిపై భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందిస్తూ, “ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంకా మాయమాటలు చెప్పడం కట్టిబెట్టి తక్షణమే మిర్చి కొనుగోలుకు చర్యలు చేపట్టాలి. మిర్చి రైతులను ఆదుకోవలసిన ప్రభుత్వం వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వారిని చేజేతులా వ్యాపారుల కబంధ హస్తాలలో పెట్టింది. ఒకపక్క బారీగా మిర్చి మార్కెట్ యార్డులకి తరలి వస్తుంటే, దానిని మార్కెటింగ్ చేసేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయకుండా, వరంగల్ లో ప్లీనరీ సభను విజయవంతం చేయడానికే ఎక్కువ దృష్టి పెట్టింది. తెరాస సర్కార్ రైతులను పట్టించుకోకపోవడమే కాకుండా వారిపై కేసులు పెట్టి జైల్లో పెట్టించింది. కనీసం ఇప్పటికైనా వారిని బేషరతుగా విడుదల చేసి, తక్షణమే మిర్చికి రూ.3,000 బోనస్ ప్రకటించాలి,” అని డిమాండ్ చేశారు. 

మిర్చికి మద్దతు ధర నిర్ణయించేది కేంద్రప్రభుత్వమని తెరాస సర్కార్ చేతులు దులుపుకొంటోంది. రూ.5,000 గిట్టుబాటు ధర ప్రకటించి కేంద్రప్రభుత్వం చేతులు దులుపుకొంది. మిర్చి రైతు విషయంలో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు నియమనిబంధనల కంటే మానవీయకోణంలో ఆలోచించి వారిని ఏవిధంగా ఆదుకోవచ్చు? అని ఆలోచించి ఉండి ఉంటే బాగుండేది. 

రాష్ట్ర ప్రభుత్వం రూ.3,000 బోనస్ ప్రకటించాలని కిషన్ రెడ్డి చెప్పడం తేలికే. కానీ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక క్వింటాలుకు రూ.3,000 చొప్పున 7 లక్షల క్వింటాళ్ళకు డబ్బు చెల్లించగలదా? అని ఆలోచిస్తే కిషన్ రెడ్డి డిమాండ్ ఎంత అర్ధరహితమో తెలుస్తుంది. అదేవిధంగా దేశంలో ఒక్క తెలంగాణా రాష్ట్రాన్నే కాకుండా అన్ని రాష్ట్రాలలో రైతుల సమస్యలను కేంద్రప్రభుత్వమే పరిష్కరించవలసి ఉంటుంది. ఇక్కడ మిర్చి రైతు అయితే పంజాబ్ లో గోధుమ రైతు, మహారాష్ట్రలో చెరుకు రైతులు ఉంటారు. కనుక కేంద్రప్రభుత్వం తన శక్తిమేర సాయం చేసిందని చెప్పవచ్చు. కనుక ఈ సమస్యపై కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలను పూర్తిగా తప్పు పట్టలేము అలాగని సమర్ధించలేము. 

ఇక దీనిలో రాజకీయాలను చూస్తే, మిర్చి రైతుల కోసం మొసలి కన్నీళ్ళు కార్చుతున్న భాజపా నేతలు తెరాస సర్కార్ ను నిందించే బదులు డిల్లీ వెళ్ళి తమ నేతలతో మాట్లాడి మరింత ఎక్కువ మద్దతు ధర ప్రకటింపజేయవచ్చు కదా? కానీ వారు ఆ పని చేయకుండా వరంగల్, ఖమ్మం కలెక్టర్ల వద్దకు వెళ్ళి మిర్చి రైతులను ఆదుకోవాలని వినతి పత్రాలు ఇస్తున్నారు! కేంద్రప్రభుత్వం చేయలేని పని జిల్లా కలెక్టర్లు చేయగలరా? తెరాస సర్కార్ కు ఎంతసేపు రాజకీయ లబ్ది కోసం ప్రాకులాడటమే తప్ప మిర్చి రైతుల కోసం చేసిందేమీ లేదని విమర్శిస్తున్న భాజపా నేతలు చేస్తున్నదేమిటి? 

ఇక తెరాస విషయానికి వస్తే, అది ప్లీనరీ సభ మీద పెట్టిన శ్రద్ధ మిర్చి రైతుల సమస్యల పరిష్కారం పెట్టలేదనేది వాస్తవం. ప్లీనరీ సభ నిర్వహించుకోవడం తప్పు కాదు. కానీ ఒకవైపు రైతులు కష్టాలలో ఉంటే, ‘రైతులు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు..మావైపే ఉన్నారు’ అని చెప్పుకోవడం..మళ్ళీ దాని కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి అట్టహాసంగా సభను నిర్వహించడం, ‘దేశంలో మరే పార్టీ ఇంత గొప్పగా సభను నిర్వహించలేదని జబ్బలు చరుచుకోవడాన్ని’ ప్రజలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారని గ్రహిస్తే మంచిది. 

కనుక తెరాస, భాజపాలు ఒకదానినొకటి నిందించుకొంటూ, విమర్శించుకొంటూ కాలక్షేపం చేయడం కంటే ఇప్పటికైనా మిర్చి, వరి, కంది రైతులను ఆదుకోవడానికి, ప్రత్యామ్నాయ మార్గాలు ఏమేమి ఉన్నాయని ఆలోచిస్తే బాగుంటుంది. ఉదా: బాబా రాందేవ్ కు చెందిన పతంజలి సంస్థ తెలంగాణా రాష్ట్రంలో పండే ఆహార ఉత్పత్తులు కొనడానికి ముందుకు వచ్చిందని ఎంపి కవిత చెప్పారు. కనుక ఈ సమయంలో అటువంటి బడా సంస్థల మద్దతు, సహాయం కోరవచ్చు. లేదా సరైన ధర వచ్చే వరకు రైతులు తమ ఉత్పత్తులను భద్రంగా దాచుకోవడానికి యుద్ద ప్రాతిపదికన తాత్కాలిక గోదాములు నిర్మించి ఇవ్వవచ్చు లేదా రైతు బజార్లలాగే ఇటువంటి ఉత్పత్తులకు కూడా నగరాలూ, పట్టణాలలో ప్రత్యేకంగా బజార్లు ఏర్పటు చేసినా రైతులకు ఎంతో కొంత మేలు జరుగవచ్చు. ఆలోచిస్తే ఇటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు చాలా కనబడవచ్చు. రైతులను..వారి సమస్యలను పట్టించుకోకుండా వారి సమస్యలపై రాజకీయాలు చేయాలని చూస్తే ఏ పార్టీ అయినా నష్టపోవడం తధ్యం. 


Related Post