తెలంగాణా బాటలో అసోం సర్కార్

May 05, 2017


img

తెలంగాణాలో ఒంటరి మహిళలకు వచ్చే నెల 2వ తేదీ నుంచి నెలకు రూ. 1,000  చొప్పున పెన్షన్ ఇవ్వడానికి తెలంగాణా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నసంగతి తెలిసిందే. తెలంగాణా బాటలోనే అసోం ప్రభుత్వం కూడా నడవాలనుకొంది. తమ రాష్ట్రంలో ‘ట్రిపుల్ తలాక్’ భాదిత ముస్లిం మహిళలకు, ఏవో కారణాల చేత విడాకులు పొంది ఒంటరి జీవితాలు గడుపుతున్న మహిళలకు పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య మరియు విద్యాశాఖ మంత్రి హిమంత బిశ్వా శర్మ మీడియాకు తెలిపారు. 

అసోం ప్రభుత్వం ఒంటరి మహిళలకు పెన్షన్ ఇచ్చి చేతులు దులుపుకోకుండా వారు తమ కాళ్ళ మీద తాము నిలబడి ఉద్యోగం లేదా ఉపాది సంపాదించుకొనేందుకు సాంకేతిక, వృత్తి నైపుణ్య శిక్షణ కూడా అందిస్తామని మంత్రి శర్మ చెప్పారు. ఈ ఆగస్టు నెలలో జరుగబోయే రాష్ట్ర శాసనసభ సమావేశాలలోగా దీనికి విధివిధానాలు ఖరారు చేసి బిల్లు పాస్ చేస్తామని చెప్పారు. 

పాలనకే పరిమితం అనుకొన్న ప్రభుత్వాలు ఈవిధంగా మానవీయకోణంలో ఆలోచించడం మెచ్చుకోవలసిన విషయమే. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలని కృతనిశ్చయంతో ఉన్న తెరాస సర్కార్, ‘ట్రిపుల్ తలాక్’ భాదిత మహిళలను కూడా ఆదుకోవడానికి అసోం ప్రభుత్వంలాగే ప్రత్యేక చర్యలు చేపడితే బాగుంటుంది కదా!  



Related Post